Funds Only Big Contractors : ఏపీలో కాంట్రాక్టర్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. నాలుగు రూపాయాలు సంపాదించుకోవచ్చునని టెండర్లలో పాల్గొని కాంట్రాక్టులు దక్కించుకుంటే ఇప్పుడు బిల్లులు రాక ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఇక కొంతకాలంగా ప్రభుత్వ పనులంటే కాంట్రాక్టర్లు భయపడే పరిస్థితి వ చ్చింది. ఇక ఏపీలో చిన్ని చిన్న కాంట్రాక్టర్లకు కోట్లలో సొమ్ము ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం.
అయితే రోజువారీ కాంట్రాక్టులు చేసే వారికే ఏకంగా రెండు వేల కోట్లు పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తున్నది. వాటి కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రభుత్వం చెల్లించడం లేదు. పోనీ కమీషన్ తీసుకొని చెల్లిస్తారా అంటే అదీ లేదు. ఏపీలో ఇప్పటికే 43 మంది కాంట్రాక్టర్లు ప్రాణాలు తీసుకున్నారని వారి సంఘం చెబుతున్నది. గతంలో బిల్లులు రాకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించి, డబ్బులు పొందేవారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి బెదిరింపుల కారణంగా ఎవరూ కిమ్మనడం లేదు. ఇక అడిగితే బెదిరింపులు, వేధింపులు, కేసులు మాములయ్యాయని కాంట్రాక్టర్లు బహిరంగంగానే చెబుతున్నారు.
గత కొంతకాలంగా ఏపీకి నిధులు భారీగానే వచ్చాయి. అప్పులు కూడా పెద్ద ఎత్తున తెచ్చారు. అలా అని ఖజానా నిండింది లేదు. పథకాల పేరిట ప్రజలకు కూడా అంతగా ఇచ్చింది లేదు. మరి ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది అంటే, బడా కాంట్రాక్టర్లకు చెల్లించడానికి ఖర్చు చేశారని సమాచారం. గత రెండు నెల్లోనే పది వేల కోట్లు చెల్లించినట్లు సమాచారం. అయితే వీరంతా ప్రభుత్వ పెద్దల అస్మదీయులతో పాటు పులివెందుల కు చెందిన కాంట్రాక్టర్లు ఎక్కువగా ఉన్నారని తెలుస్తున్నది.