MLC Kavitha : కవితకు బెయిల్ నిరాకరణ..ఏం చేద్దాం?
MLC Kavitha : మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఏది కలిసి రావడం లేదు. కీలక నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతుండడం, పలు కేసులు చుట్టుముడుతుండడం అగ్రనేతలను కలవరపరుస్తోంది. 23ఏండ్ల పార్టీ ఏనాడూ ఇంత అధ్వాన పరిస్థితికి చేరింది లేదు. అన్నిటి కంటే మించి లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ పార్టీని బాగా కుంగదీసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే తన కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఈ కేసులో తనకు ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ కావాలంటూ కోర్టును ఆశ్రయించారు కవిత.
దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ రౌస్ అవెన్యూ న్యాయస్థానం కవిత అభ్యర్థనను తిరస్కరించింది. కాగా, కవిత రెగ్యులర్ బెయిల్ విచారణ ఈనెల 20న జరుగనున్న నేపథ్యంలో నెక్ట్స్ ఏంటి? అనే సందేహంలో ఉన్నారు కవిత కుటుంబ సభ్యులు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొని నిందితులుగా జైలు జీవితం అనుభవిస్తున్న వారు కొందరైతే, అప్రూవల్ గా మారి న్యాయస్థానాలకు సహకరిస్తాం అంటూ బెయిల్ మీద బయటకు వచ్చినవారు మరి కొందరు.
ఇటువంటి తరుణంలో కవిత కేసులో కూడా ఇప్పటికిప్పుడే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆశించే మార్పులేమీ చోటుచేసుకోకపోవచ్చు అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. లిక్కర్ కేసులో నిందితురాలిగా ఉన్న కవిత బెయిల్ మీద బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ అధికారులు తమ వాదనను వినిపించడంతో ఏకీభవించిన న్యాయస్థానం కవిత బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది.
అయితే రేపటితో కవిత జ్యూడిషియల్ రిమాండ్ గడువు ముగియడంతో నెక్ట్స్ ఏంటి అనే ఆలోచనలో ఈడీ అధికారులు కూడా తదుపరి కార్యాచరణకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇలా కవితకు బెయిల్ రాకపోవడంతో ఏం చేయాలి అనే ఆలోచనలో కవిత కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, జ్యూడిషియల్ రిమాండ్ ముగియడంతో తర్వాత ఏం చేయాలి అంటూ ఈడీ అధికారులు తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.