Metro : మెట్రో రెండో దశ పునాదితో పుంజుకోనున్న రియల్ మార్కెట్.. దానికి దీనికి లింకేంటి?

Metro

Metro

Metro : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఒకటి, రెండు నెలలు మాత్రమే రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుంది. హైడ్రా కూల్చివేతలు చేపట్టినప్పటి నుంచి అంటే దాదాపు ఐదు నుంచి ఆరు నెలలుగా రియల్ మార్కెట్ మొత్తం పడిపోయింది. ఎంతలా అంటే నిర్మాణంలో ఉన్న ఇళ్లను కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో హైదరాబాద్ ప్రధాన ఆదాయం దెబ్బతిన్నది. హైదరాబాద్ మహానగరంలో ఇళ్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం కొన్ని నెలలుగా స్తబ్ధత కొనసాగుతోంది. ఈ సమయంలో ప్రభుత్వం మెట్రో రెండో దశ ప్రకటించింది. ఇది రియల్ వ్యాపారులకు ఆశాకిరణంలా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెట్రో సెకండ్ ఫేజ్‌కు కేంద్రం ఆమోదం తెలపడంతోనే ఈ ఐదు మార్గాల్లో 78.6 కిలో మీటర్ల పనులు ప్రారంభమవుతాయి.

మెట్రో రెండో దశలో అన్ని మార్గాలు మొదటి దశలోని మూడు కారిడార్లకు కొనసాగింపుగా ఉన్నాయి. ఈ దశలో అటు హయత్ నగర్.., ఇటు పటాన్ చెరు, ఎయిర్ పోర్టు వరకు మెట్రో అందుబాటులోకి వస్తుంది. ఎల్బీనగర్, మైలార్‌ దేవుపల్లి, జల్‌పల్లి, శంషాబాద్‌ వరకు 22 స్టేషన్లను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలతో విజయవాడ జాతీయ రహదారిపై హయత్ నగర్, ముంబై జాతీయ రహదారిపై పటాన్ చెరు నుంచి మొదలు సంగారెడ్డి వరకు.., బెంగళూర్ జాతీయ రహదారిపై శంషాబాద్ నుంచి షాద్ నగర్ వరకు.., మరోవైపు ఫ్యూచర్ సిటీ వరకూ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోనుంది.

ఇప్పటికే ఆయా ప్రాంతాలలో నిర్మాణాలు జరుగుతన్నాయి. కానీ ప్రభుత్వం సరైన విజన్ ను బయట పెట్టకపోవడం సమస్యకు దారి తీస్తోంది. ఇప్పుడు మెట్రో రూపంలో రవాణా సౌకర్యం పెరిగితే మధ్య, ఎగువ మధ్య తరగతి ఆయా ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరుచుకుంటారు. భవిష్యత్ లో పెట్టుబడుల కోసం కొనుగోళ్లు సైతం పెరుగుతాయి. అందుకే మెట్రో పనుల ప్రారంభం కోసం రియల్ వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.

TAGS