Hyderabad Real Estate : హైదరాబాద్ లో మరింత పుంజుకున్న రియల్ ఎస్టేట్.. ఇళ్ల ధరలు ఎంతో తెలుసా?
Hyderabad Real Estate : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఇళ్ల ధరలు గత మూడేళ్లలో కంటే ఎక్కువగా పెరిగాయని స్థిరాస్తి కన్సల్టెంట్ అనరాక్ విశ్లేషించింది. ప్రధానంగా గచ్చిబౌలి ప్రాంతంలో ధరలు 33 శాతం పెరిగాయని పేర్కొంది. 2020, అక్టోబర్ లో ఈ ప్రాంతంలో ఫీటుకు సగటు ధర రూ.4,790 ఉండగా, 2023, అక్టోబర్ నాటికి రూ.6,355కు చేరిందని కన్సల్టెంట్ సంస్థ పేర్కొంది.
ఇదే సమయంలో కొండాపూర్‌లో చదరపు అడుగుకు సగటు రూ.4,650 నుంచి 31 శాతం వృద్ధితో రూ.6,090కి చేరిందని పేర్కొంది. మూడేళ్లలో దేశ వ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో సగటు ధరలు 13 శాతం నుంచి 33 శాతం వృద్ధి చెందాయని నివేదిక పేర్కొంది. ఈ ప్రకారం.. బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో ఫీటుకు రూ.4,900 నుంచి 29 శాతం వృద్ధితో రూ.6,325కు చేరింది. ధనిసంద్ర మేయిన్ రోడ్, సర్జాపూర్ రోడ్‌లో 27 శాతం, 26 శాతం చొప్పున పెరిగాయి.
ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఇళ్ల సగటు ధరలు 13 శాతం నుంచి 27 శాతం పెరిగాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గ్రేటర్ నోయిడా వెస్ట్, సెక్టార్ 150 (నోయిడా), రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్ (ఘజియాబాద్)లో 27 శాతం, 25 శాతం, 21 శాతం చొప్పున పెరిగాయి. ఎంఎంఆర్ లోయర్ పారెల్‌లో 21 శాతం వరకు పెరిగాయి.
పుణెలో వాఘోలిలో 25 శాతం, హింజేవాడిలో 22 శాతం, వాకడ్‌లో 19 శాతం వృద్ధి చెందాయి. ఈ ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమ ప్రభావం ఎక్కువగా ఉంది. చెన్నైలో పెరుంబాకమ్‌లో 19 శాతం, గుడువంచేరీలో 17 శాతం, పెరంబూర్‌లో 15 శాతం చొప్పున ఇళ్ల సగటు ధరలు పెరిగాయి. కోల్‌కతాలో జోకా, రజార్‌హాట్, ఈఎం బైపాస్‌లలో వరుసగా 24 శాతం, 19 శాతం, 13 శాతం చొప్పున పెరిగాయి.
ఇళ్ల గిరాకీతో పాటు ఖాళీ స్థలాల ధరలు కూడా పెరగడం, నిర్మాణంలో వినియోగించే సిమెంట్, ఇసుక, ఉక్కుతో పాటు ముడి సామగ్రి వ్యయాలు, భవన నిర్మాణ కార్మికుల కూలీ విపరీతంగా పెరగడంతో ఇళ్ల సగటు ధరలు 7 ప్రధాన నగరాల్లో పెరిగాయని అనరాక్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైందని ప్రాంతీయ డైరెక్టర్, హెడ్ వెల్లడించారు. కొనుగోలుదారుల పెద్ద ఇళ్లతో పాటు విస్తృత సౌకర్యాలు కోరుకుంటుండడమూ ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు.