Real Estate : రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ దారుణంగా దెబ్బతింది. రెండు రాష్ట్రాల్లోనూ అపార్ట్ మెంట్లు కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎప్పుడూ పెరగడమే కాని తగ్గడమనేది లేదు. అలాగే ఏపీలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో రాజధాని అమరావతిలో రియల్ వ్యాపారం జోరుగా ఉంటుందని భావించారు. అయితే రెండు రాష్ట్రాల్లో పెద్దగా రియల్ లావాదేవీలు జరగడం లేదు.
తెలంగాణలోని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కూల్చివేతలే కారణమని పేర్కొనాలి. హైడ్రా సంస్థ ఏర్పాటుతో కాల్వలు, చెరువులు, నాలాలపై నిర్మాణాలను తొలగిస్తుండడంతో ప్లాట్లను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. తాము కొనుగోలు చేసే స్థలమైనా, విల్లా అయినా, అపార్ట్ మెంట్ అయినా ఎఫ్ టీఎల్ లేదా బఫర్ జోన్ పరిధిలో ఉంటుందేమోననే భయంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ పరిణామాలతో రియల్ వ్యాపారం మందగించిందని వ్యాపారులు చెప్తున్నారు. హైదరాబాద్ లో అనేక అపార్ట్ మెంట్లు కొనేవారు లేక ఖాళీగా ఉన్నాయి. తక్కువ ధరకు ఇస్తామన్నా ఎవరూ కూడా ముందుకురాని పరిస్థితి నెలకొంది.
ఏపీలోని రాజధాని అమరావతిలోనూ రియల్ పరిస్థితి అలానే ఉంది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నా ఇక్కడ కొనేవారు లేరు. దీనికి ప్రధాన కారణం అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు పెంచేయడమే. గత ప్రభుత్వ హయాంలో కోటి రూపాయలు ఎకరా ఉన్న భూమి ప్రస్తుతం మూడు నుంచి నాలుగు కోట్ రూపాయల ధర పలుకుతుండడంతో కొనుగోలు దారులు ముందుకు రావడం లేదు. భవిష్యత్ లో ఈ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వస్తే పరిస్థితి ఏంటన్న ఆలోచన కూడా కొనుగోలుదారులను వెనక్కు లాగుతోంది.
ఇప్పటి వరకు రాజధాని అమరావతి పనులు నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాకపోడం కూడా మరొక కారణంగా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా పడిపోవడానికి ప్రధాన కారణం విశ్వాసం లేకపోవడమే. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారడం వల్ల ఆ దెబ్బ రియల్ ఎస్టేట్ పై పడింది. ఇలా రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినా రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రం దారుణంగా పడిపోయిందనే లెక్కలు చెబుతున్నాయి.