JAISW News Telugu

Vladimir Putin : యుద్ధంపై చర్చలకు సిద్ధమే: రష్యా అధ్యక్షుడు పుతిన్

Vladimir Putin

Vladimir Putin

Vladimir Putin : ఉక్రెయిన్ తో యుద్ధంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. కాని తమ దేశ ప్రయోజనాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. గురువారం నుంచి రెండు రోజులు చైనాలో పర్యటించనున్న ఆయన చైనాకు చెందిన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ‘‘యుద్ధం గురించి చర్చలు జరిపేందుకు మేమెప్పుడూ నిరాకరించలేదు. ప్రస్తుత ఘర్షణకు శాంతియుత మార్గాల్లో సమగ్ర, సుస్థిర పరిష్కారాన్ని కోరుకుంటున్నాం. ఉక్రెయిన్ తో చర్చల్లో మాతో సహా అన్ని భాగస్వామ్య దేశాల ప్రయోజనాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి’’ అని పుతిన్ వ్యాఖ్యానించారు.

అయితే, తమ దేశ ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించడం, రష్యా బలగాల ఉపసంహరణ, ఖైదీల విడుదల, ఘర్షణకు బాధ్యులెవరో తేల్చేందుకు ట్రిబ్యునల్ ఏర్పాటు వంటి అంశాలు రష్యాతో యుద్ధంపై చర్చల ఎజెండాలో ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు పట్టుబడుతున్న విషయం తెలిసిందే.

ఈశాన్య ఉక్రెయిన్ లోని ఖర్కీవ్ ప్రాంతంలో రష్యా దూకుడు పెంచిన నేపథ్యంలో జెలెన్ స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పెయిన్, పోర్చుగల్ సహా మరికొన్ని దేశాలకు రాబోయే కొన్ని రోజుల్లో తాను చేపట్టాల్సిన పర్యటనలను వాయిదా వేసుకున్నారు. ఉక్రెయిన్ కు అమెరికా 200 కోట్ల డాలర్ల ఆయుధ ప్యాకేజీ అందించనుంది. ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న అగ్రరాజ్య విదేశాంగ మంత్రి అంటోని బ్లింకెన్ ఈ అంశాన్ని వెల్లడించారు.

Exit mobile version