CM Jagan : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పార్టీలు దూకుడు పెంచాయి. ప్రచార సభల్లో నేతల మాటలు హద్దులు దాటుతున్నాయి. ఇక జగన్ ప్రసంగాలు వింటే పుణ్యపురుషుల నీతివచనాల లాగానే ఉంటున్నాయి. వివేకా హత్య కేసు దగ్గర నుంచి తన పరిపాలన ఘనతల వరకూ.. ప్రతీ అంశంలోనూ సీఎం జగన్ చెబుతున్న విషయాలు.. చెప్పుకుంటున్న అంశాలు.. క్రెడిట్ తీసుకుంటున్న వ్యవహారాలు చూస్తే..ఐదేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై కనీస అవగాహన ఉన్న వారు కూడా .. నేను విన్నది నిజమేనా అని అశ్చర్యపోక తప్పదేమో? అనిపిస్తోంది.
వివేకాను చంపింది..చంపించింది ఎవరో దేవుడికి తెలుసు.. జిల్లా ప్రజలకు తెలుసంటూ కొత్త నాటకాలు ప్రారంభించారు. మరి సీఎంగా ఉండగా నిందితుల్ని ఎందుకు పట్టుకోలేదు? అత్యంత దుర్మార్గంగా వివేకా కుమార్తె మీదే ఎందుకు నిందలు వేస్తున్నారు? వాళ్లు న్యాయం కోసం పోరాడితే మళ్లీ రాజకీయం కూడా. సొంత కుటుంబాన్నే ఇలా రోడ్డున పడేసుకుని రాజకీయం చేసుకుంటున్న జగన్.. పాలన విషయంలోనూ ఆయన చెప్పే మాటలు వింటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అయిపోతుంది.
మూడు రాజధానులు ఏర్పాటు చేశాను.. 17 మెడికల్ కాలేజీలు కట్టేశాను.. బోలెడంత అభివృద్ధి చేశారు.. లక్షల కోట్లు ఇచ్చేశాను.. పిల్లలకు ట్యూబులిచ్చాను.. పెద్ద పెద్ద కథలు చెబుతున్నారు. మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టారో.. మూడు రాజధానులు ఎక్కడ ఏర్పాటు చేశారో ఎవరికైనా తెలుసా? తాను చెప్పేది నిజమని నమ్మేవాళ్లు ఉంటారన్న ఓ గుడ్డి నమ్మకంతో.. ప్రజల్ని అడ్డగోలుగా మోసం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఎంతగా అంటే తాను చిన్న పిల్లోడినని ఎంతో చేశానని.. కానీ చంద్రబాబు ఎందుకు చేయలేదంటున్నారు. ఆయన చేశానని చెబుతున్నవేమీ జరుగలేదు. అయినా సరే ప్రచారం చేసుకోవడమే పెద్ద వింత..
పక్క పార్టీపై వ్యతిరేకతతోనో పక్క నేతలపై వ్యతిరేకతతోనో.. కుల వ్యతిరేకతతోనో.. లేకపోతే మత అభిమానంతోనో తమను నమ్మేవాళ్లు ఉంటారు అన్న ఒకే ఒక్క నమ్మకం. ప్రజల ఐక్యూకు..కామన్ సెన్స్ కు జగన్ పరీక్ష పెడుతున్నారు. కళ్ల ముందు కనిపించే వాటిపైనా పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.