Telangana DGP:తెలంగాణ డీజీపీగా రవిగుప్తా నియామకం
Telangana DGP:తెలంగాణ డీజీపీగా రవిగుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతో పాటు ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీ కుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి కాంగ్రెస్ నేత, టీపీసీసీ అథ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసినందుకు గానూ డీజీపీని అంజనీ కుమార్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసి షాకిచ్చింది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో డీజీపీ అంజనీ కుమార్, ఇద్దరు అదనపు డీజీలు సందీప్ కుమార్ జైన్, మహేష్ భగవత్ కాంగ్రెస్ టీపీసీసీ అధినేత రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిని కలిసిన డీజీపీని సస్పెండ్ చేసిన ఈసీ ఇద్దరు అదనపు డీజీలకు నోటీసులు జారీ చేసింది.
అనంతరం సీనియర్ ఐపీఎస్ అధికారిని డీజీపీగా నియమించాలని ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు అంజనీ కుమార్ తరువాత సీనియర్ అధికారిగా ఉన్న రవిగుప్తా బాధ్యతలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.