Ratha Saptami : తిరుమలలో రథసప్తమి వేడుకలు.. శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్త జనం
Tirumala Ratha Saptami : తిరుమల శ్రీవారి ఆలయంలో రథ సప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారు జాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు వాహన మండపం నుంచి వాయవ్యం దిశకు స్వామివారు చేరుకున్నారు. భానుడి కిరణాలు స్వామి పాదాలకు తాకిన తరువాత అర్చకులు హారతులు, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి వాహన సేవను ప్రారంభించారు. సూర్యప్రభ వాహనంపై సప్తగిరీశుడు దర్శనమివ్వగా అనంతరం చినశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
రథసప్తమి సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. భక్తులు స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుకుని పారవశ్యంలో తేలియాడుతున్నారు. రథసప్తమి వేడుకల్లో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, పలువురు ప్రముఖులు హాజరయ్యి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.
రథసప్తమి సందర్భంగా ఏడు వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో స్వామివారి విహరించనున్నారు. తెల్లవారు జామునుంచి ఉదయం 8గంటల వరకు సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఊరేగుతారు. 9గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనంపై, 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1గంట నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హనుమంత వాహన సేవ, మధ్యాహ్నం 2గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు చక్రస్నానం. సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ.. సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 7గంటల వరకు సర్వభూపాల వాహన సేవ. రాత్రి 8గంటల నుంచి రాత్రి 9గంటల వరకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రథసప్తమి సందర్భంగా ఇవాళ తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఇదిలాఉంటే నిన్న (గురువారం) శ్రీవారిని 45,825 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు సమకూరింది.