JAISW News Telugu

Rapid India : దూసుకెళ్తున్న భారత్.. కేవలం 100 గంటల్లో..100 కి.మీ రోడ్డు నిర్మాణం

Rapid India : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ అలీఘర్ ఎక్స్‌ప్రెస్‌వే (NH 34) రికార్డు సమయంలో నిర్మించబడింది. కేవలం 100 గంటల్లోనే 100 కిలోమీటర్ల పొడవైన హైవేను నిర్మించినట్లు జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ ప్రకటించింది. దీని ప్రకారం కేవలం నాలుగు రోజుల నాలుగు గంటల్లో వంద కిలోమీటర్ల రోడ్డును నిర్మించి ప్రపంచ రికార్డు సృష్టించారు. వర్చువల్ గా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 118 కిలోమీటర్ల పొడవునా ఘజియాబాద్-అలీగఢ్ ఎక్స్‌ప్రెస్ వే కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు.

ఈ రహదారి ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీ, గౌతమ్ బుద్ధ నగర్, సికందర్‌బాద్, బులంద్‌షహర్, ఖుర్జాలను కలుపుతుంది. సరకుల రవాణాకు కూడా హైవే కీలకంగా మారనుంది. ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి, పారిశ్రామిక ప్రాంతాలకు, సాగు ప్రాంతాలకు, విద్యాసంస్థలకు ఈ ఎక్స్‌ప్రెస్‌వే దోహదపడుతుంది. ఘజియాబాద్-అలీగఢ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించామని నితిన్ గడ్కరీ తెలిపారు. దాదాపు 90 శాతం మిల్లింగ్ మెటీరియల్ వినియోగిస్తున్నట్లు చెప్పారు. దీంతో హైవే నిర్మాణ సమయంలో పర్యావరణానికి హాని కలిగించే ఉద్గారాలు గణనీయంగా తగ్గాయని పేర్కొంటున్నారు. కార్బన్ ఫుట్ ప్రింట్ చాలా వరకు తగ్గుతుందని వివరించారు.

Exit mobile version