Ramayana:2024 వేసవిలో రామాయణం సెట్స్‌పైకి?
Ramayana:బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమా అమీర్ ఖాన్ నటించిన దంగల్ రికార్డులను సైతం బ్రేక్ చేస్తోందని కథనాలొచ్చాయి. ఇప్పటికే 500 కోట్ల నెట్ వసూలు చేసిన ఈ చిత్రం 1000 కోట్లు వసూలు చేసే దిశగా వెళుతోందని కథనాలొస్తున్నాయి. ప్రస్తుతం రణబీర్ ఈ విజయాన్ని ఆస్వాధిస్తున్నాడు. ఇంతలోనే అతడు నటించే తదుపరి క్రేజీ ప్రాజెక్ట్ గురించి అప్ డేట్ అందింది.
రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా నటించనున్న రామాయణం 2024 వేసవిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఈ చిత్రాన్ని నితీష్ తివారీ తెరకెక్కించనున్నారు. అల్లు అరవింద్- మధు మంతెన వంటి ప్రముఖులు ఈ సినిమాకి ఆర్థికంగా బ్యాకింగ్ ఇవ్వనున్నారని గతంలో కథనాలొచ్చాయి. ఈ సినిమాలో రావణాసురుడి పాత్ర కోసం ఇప్పటికే కేజీఎఫ్ యష్ ని సంప్రదించిన సంగతి తెలిసిందే. త్వరలోనే కాస్టింగ్ వివరాల్ని కూడా టీమ్ వెల్లడించనుందని తెలిసింది.
ఇటీవల రణబీర్ ని విమానాశ్రయంలో కలిసిన ఒక అభిమాని రామాయణం గురించిన తాజా లీకులు అందించాడు. అతడు క్యూలో ఉన్నప్పుడు రణబీర్ తో మాట్లాడానని యానిమల్ గురించి మాట్లాడుతూనే రామాయణం గురించి ప్రశ్నించానని సోషల్ మీడియాల్లో వెల్లడించాడు. రణబీర్ స్పందిస్తూ వచ్చే ఏడాది వేసవిలో రామాయణం సెట్స్ పైకి వెళుతుందని చెప్పినట్టు తెలిపారు. ఇంతకుమించి ఈ ప్రాజెక్ట్ గురించి రివీల్ చేయొచ్చో లేదో నాకు తెలీదు. ఈ సినిమా తారాగణం మరో లెవల్లో ఉండనుంది. రణబీర్ ఎంత అందగాడు ఎంత మంచివాడు! అంటూ అతడు పొగిడేశాడు.
ఎట్టకేలకు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రామాయణం సెట్స్ పైకి వెళుతోందని క్లారిటీ వచ్చేసింది. ఇంతకుముందు ప్రభాస్ కథానాయకుడిగా ఓంరౌత్ ఆదిపురుష్ ని రామాయణం ఆధారంగా రూపొందించారు. అతడు ఇందులో పాత్రల్ని ఖూనీ చేసాడని విమర్శలొచ్చాయి. అలాంటి తప్పిదాలు జరగకుండా నితీష్ తివారీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది. హిందువుల మనోభావాలను, లార్డ్ శ్రీరాముని భక్తుల మనోభావాలను దెబ్బ తీయకుండా రామాయణం చిత్రాన్ని తెరకెక్కిస్తారని ఆశిద్దాం.