Ramu Venigalla : ఛార్లెట్‌లో రాము వెనిగళ్ల అభినందన సభ.. తరలి వచ్చిన తెలుగు వాళ్లు..

Ramu Venigalla: ఇటీవల సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గుడివాడ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన, భాజాపా కూటమి అభ్యర్థిగా అట్లాంటా వాసి, ప్రముఖ పారిశ్రామికవేత్త రాము వెనిగళ్ల విజయం సాధించారు. దాదాపు 53,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అమెరికా ప‌ర్యటనలో భాగంగా అట్లాంటా విచ్చేసిన సంద‌ర్భంగా ఆయ‌న మిత్రులు, శ్రేయోభిలాషులు, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రవాస ఆంధ్రులు, మహాకూటమి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో రాము వెనిగళ్ల ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. నార్త్‌ కరోనిలినాలోని హంటర్స్‌ విల్లే, గ్రీన్‌ మేనర్‌ ఫామ్స్‌లో జరిగిన అభినందన సభలో వర్కింగ్‌ డే అయినా దాదాపు 400 మంది ఎన్నారైలు కార్యక్రమానికి హాజరయ్యారు. చాలా మంది తమ కుటుంబ సభ్యులతో సభకు రావడం సభకు మరింత శోభను తీసుకొచ్చింది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రులు ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావు, నందమూరి హరికృష్ణ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాము వెనిగళ్లను వేదికపైకి ఆహ్వానించారు. కార్యక్రమంలో తానా తాజా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు పాల్గొన్నారు.

రాము వెనిగళ్ల సభా ప్రాంగణానికి వందలాది కార్లతో ర్యాలీగా తీసుకురాగా తెలుగు మహిళలు ఘనస్వాగతం పలకగా, వారితో పాటు కుటమి అభిమానులు డప్పు మేళాలతో సభా ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వెనిగండ్ల శ్రీరాములు, ఆయన సతీమణి సుఖద వెనిగండ్ల, అట్లాంటా నాయకులు శ్రీనివాస్ లావు, అంజయ చౌదరి లావు, మల్లిక్ మేదరమెట్ల, సతీష్ ముసునూరి, సురేష్ ధూళిపూడి వేదికను అలంకరించారు. ఈ కార్యక్రమానికి సురేష్ పెద్ది, సుజాత ఆలోకం యాంకర్లుగా వ్యవహరించారు.

నాలుగు దఫాలుగా అభివృద్ధికి నోచుకోని గుడివాడ వాసుల కష్టాలను తాను కళ్లారా చూశానని, రాష్ట్రాభివృద్ధికి ఎంతో కీలకమైన గుడివాడ అభివృద్ధికి ప్రవాసాంధ్రులు సహకారం అందించాలని శ్రీమతి సుఖద వెనిగండ్ల సభికులకు వివరించారు. ఆత్మీయ సన్మాన గ్రహీత గుడివాడ శాసనసభ్యులు రాము వెనగళ్ల మాట్లాడుతూ గుడివాడ తన జన్మస్థలమని, తన గొప్పతనానికి కారణమైన అట్లాంటా కూడా తన స్వగ్రామమని అన్నారు. స్వగ్రామమైన గుడివాడలో వెనిగళ్ల ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ విజయం ద్వారా కనీస సౌకర్యాల విషయంలోనూ తమ బాధ్యత పెరిగిందన్నారు. అమెరికాలో తెలుగు జాతికి సేవ చేస్తూనే మరోవైపు జన్మభూమి ప్రగతికి తోడ్పాటునందిస్తున్న ఎన్నారైల సేవలు మరువలేనివని అన్నారు.

తన విజయంలో ఎన్నారై కీలక పాత్ర పోషించారని కూడా ఆయన పేర్కొన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రగతికి, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తోందని వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నారైలు కూడా ముందుకు వచ్చి జన్మభూమి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఏపీలో వివిధ రంగాల్లో అనుకూలమైన అవకాశాలున్నాయన్నారు. మానవ వనరులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నందున, రాష్ట్ర ప్రగతికి పెట్టుబడులు పెట్టాలని ఎన్నారైలు కోరారు.

TAGS