Ramoji Rao : ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. వయోభారం రీత్యా పలు ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన కొంతకాలంగా మంచానికే పరిమితమయ్యారు. శనివారం ఉదయం నానక్ రామ్ గూడ లోని స్టార్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. నిన్న మధ్యాహ్నం మూడుగంటలకు తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనకు స్టార్ హాస్పిటల్స్ వైద్యులు చికిత్స అందించారు. కొంత కాలం క్రితమే ఆయనకు గుండె సమస్య ఏర్పడడంతో స్టంట్స్ కూడా వేసినట్లుగా డాక్టర్లు చెబుతున్నారు. ఇక నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. నిన్న రాత్రి ఆయన ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్ మీదే ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఆయన కన్నుమూసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. నేడు(శనివారం) తెల్లవారుజామున 4:50 ని.లకు నిమిషాలకు రామోజీ రావు తుది శ్వాస విడిచారు.
ఆయనకు రక్తపోటు ఎంతకూ నియంత్రణలోకి రాకపోవడంతో గుండెకు వైద్యులు స్టంట్ వేశారు. దీంతో బీపీ కొంతమేర తగ్గినప్పటికీ.. ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. రామోజీరావు కొన్నేళ్ల క్రితం కోలన్ క్యాన్సర్ బారిన పడ్డారు. దాని నివారణ కోసం చికిత్స తీసుకున్నారు. అనంతరం ఆయన కోలుకున్నారు. అనంతరం ఆయన తన పనుల్లో నిమగ్నమయ్యారు. గతంలో మాదిరే ఈనాడు, ఫిలిం సిటీ, ఈటీవీ భారత్, డాల్ఫిన్.. వంటి వాటి వ్యవహారాలను దగ్గరుండి చూసుకునేవారు. కీలక ఉద్యోగులతో ఎప్పటికప్పుడు సమావేశాలు, సమీక్షలు నిర్వహించేవారు.
ప్రస్తుతం ఆయన వయసు 88 సంవత్సరాలు. ఆ వయసు రీత్యా ఆయన అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నాలుగు రోజుల క్రితం వరకు రామోజీరావు మాములుగానే ఉన్నారు. అయితే అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడ్డారు. అప్పటినుంచి ఆయన కోలుకోలేదు. పెద్దగా పేరున్న డాక్టర్లు సైతం ఫిలిం సిటీ కి వచ్చి చికిత్స చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆయనను శుక్రవారం నానక్ రామ్ గూడ ఆస్పత్రి తరలించారు. ఆయన మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఈనాడు ఉద్యోగులు ప్రార్థనలు, పూజలు చేశారు. కానీ వారి పూజలు ఫలించలేదు. శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. చివరిగా ఆయన నిర్మాతగా దాగుడుమూతలు దండాకోరు అనే సినిమా నిర్మించారు. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.