Ramoji Group Donation : అమరావతి నిర్మాణానికి రామోజీ గ్రూపు నుంచి రూ.10 కోట్లు విరాళం ఇస్తున్నట్లుగా ఈనాడు సంస్థల ఎండీ కిరణ్ ప్రకటించారు. విజయవాడలోని కానూరులోని అనుమోలు గార్డెన్స్ లో గురువారం ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో కిరణ్ మాట్లాడారు. నవ్యాంధ్ర రాజధాని పేరును అమరావతిగా తన తండ్రి రామోజీరావు సూచించినట్లుగా గుర్తు చేశారు.
ఈ క్రమంలోనే అమరావతి నిర్మాణానికి రామోజీ గ్రూపు నుంచి రూ.10 కోట్లు విరాళం ఇస్తున్నట్టుగా కిరణ్ ప్రకటించారు. సభ ఏర్పాటు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కిరణ్ ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి రామోజీరావు ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభగా భావిస్తున్నట్టు కిరణ్ పేర్కొన్నారు.
ఈ సంస్మరణ సభకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి హాజరయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, కీరవాణి, రాజమౌళి, అశ్వనీదత్, శ్యాంప్రసాద్ రెడ్డి, మురళీ మోహన్, సురేశ్ బాబు, జయసుధ, బోయపాటి శ్రీనివాస్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై రామోజీరావు సేవలను కొనియాడారు.