JAISW News Telugu

Ramgopal Verma : రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు

Ramgopal Verma : ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అయితే, తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్ ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.

రాంగోపాల్ వర్మ అభ్యర్థనపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల నుంచి అరెస్టు ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని కోర్టు సూచించింది. ఈ క్రమంలోనే పోలీసుల విచారణకు తనకు మరికొంత సమయమిచ్చేలా ఆదేశించాలని కోర్టును ఆయన కోరారు. ఆ అభ్యర్థనను కూడా పోలీసుల ముందు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అయితే, తనపై నమోదైన కేసును కొట్టేయాలని వేసిన ఆర్జీవీ వేసిన పిటిషన్ ను రెండు వారాల తర్వాతే విచారణ జరపనుంది.

ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో నవంబరు 19న పోలీసుల విచారణలో వర్మ పాల్గొనాల్సి ఉంది.

Exit mobile version