Ayodhya Ram Temple:అయోధ్య‌ రామమందిరం..అద్వానీ, జోషీల‌కు ఆహ్వానం లేదా?

Ayodhya Ram Temple:అయోధ్య‌ రామ‌మందిర ప్రారంభోత్స‌వానికి చ‌క‌చ‌కా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ఆల‌య ట్ర‌స్ట్ త‌రుపున ముగ్గురు స‌భ్యుల బృందం అధికారికంగా ఆహ్వానాలు అందిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖుల‌కు ఆహ్వానాలు అందించిన ఆల‌య ట్ర‌స్ట్ బీజేపీ కురువృద్ధులు లాల్ కృష్ణ అద్వానీ, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషీల‌కు మాత్రం ఆహ్వానాలు అందించ‌లేద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆమోద్య‌లో రామ‌మందిర నిర్మాణం కోసం ఉద్య‌మించిన వాళ్ల‌లో వీరిద్ద‌రు ముందు వ‌రుస‌లో ఉంటారు.

అలాంటి వీరిద్ద‌రికి ఆల‌య ప్రారంభోత్స‌వానికి సంబంధించిన ఆహ్వానాలు అంద‌క‌పోవ‌డం ఏంట‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. బీజేపీ వ‌ర్గాల‌పై విమ‌ర్శ‌లు వినిపించాయి. ఈ నేప‌థ్యంలో రామ మందిరం ట్ర‌స్ట్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ చంప‌త్ రాయ్ స్పందించారు. రామ‌మందిర ప్రారంభోత్స‌వ విష‌యం వారికి తెలియ‌జేశామ‌ని, అయితే వృధ్ధాప్యం, వారికున్న ఆరోగ్య స‌మ‌స్య‌ల దృష్ట్యా వారిని ఇబ్బంది పెట్ట‌డం ఇష్టం లేక రావొద్ద‌ని చెప్పామ‌ని తెలిపారు.

అందుకు వాళ్లిద్ద‌రూ, వారి కుటుంబ స‌భ్యులు అంగీక‌రించిన‌ట్లు చంప‌త్ రాయ్ మీడియాకు తెలియ‌జేశారు. అద్వానీ వ‌య‌సు 96 ఏళ్లు కాగా, జోషీ వ‌య‌సు 90. జ‌న‌వ‌రి 22న రామ‌మందిర ఆల‌య ప్రారంభోత్స‌వం జ‌రుగ‌నుంది. ప్ర‌ధాని మోదీ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న‌కు ఆహ్వానం అంద‌జేశారు. జ‌న‌వ‌రి 15వ తేదీలోపు ఏర్పాట్ల‌న్నీ పూర్తి చేస్తామని, ఆ మ‌రుస‌టి రోజు ప్రాణ ప్ర‌తిష్ట పూజ మొద‌లై..జ‌న‌వ‌రి 22వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని చంప‌త్ రాయ్ తెలియ‌జేశారు.

TAGS