Ram Setu : భారత అంతరిక్ష సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) భారత్, శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదని.. నిజమేనని తెలిపింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను విడుదల చేశారు. దీనిని ఆడమ్స్ బ్రిడ్జ్ అంటారు. మునిగిపోయిన వంతెన భారతదేశంలోని ధనుష్కోడి నుండి శ్రీలంకలోని తలైమన్నార్ ద్వీపం వరకు విస్తరించి ఉందని స్పష్టం చేసింది. ఇస్రో జోధ్‌పూర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌ల పరిశోధకులు నాసా ఉపగ్రహం ICESat-2తో మ్యాప్‌లను అధ్యయనం చేశారు. ఇది సముద్రపు అడుగుభాగం నుండి లేజర్ కిరణాలను బౌన్స్ చేసింది. ఆడమ్స్ వంతెనలో 99.8 శాతం నీటిలో మునిగిపోయిందని కనుగొన్నారు. ఈ కారణంగా నౌకల ద్వారా వంతెనను సర్వే చేయడం కష్టమని తెలిపారు. శాస్త్రవేత్తలు వంతెన క్రింద 2-3 మీటర్ల లోతులో ఉన్న 11 సన్నని కాలువలను కూడా గమనించారు. ఇవి గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ జలసంధి మధ్య నీటి ప్రవాహాన్ని సులభతరం చేశాయి.
రామసేతు (ఆడమ్స్ వంతెన), ధనుష్కోడి, తలైమన్నార్ దీవులను కలుపుతూ ఉన్నట్లు పరిశోధనలు నిర్ధారించాయి. అయితే ఇప్పటికే ఉన్న భౌగోళిక ఆధారాలు ఈ వంతెన భారతదేశం, శ్రీలంక మధ్య పూర్వపు భూసంబంధాన్ని సూచిస్తున్నాయి. ఆడమ్స్ బ్రిడ్జ్ ను భారత ఉపఖండంలో రామసేతు అని పిలుస్తారు. ఇది శ్రీలంక వాయువ్య తీరంలో మన్నార్ ద్వీపం, భారతదేశం ఆగ్నేయ తీరంలో ఉన్న రామేశ్వరం ద్వీపం మధ్య ఉంటుంది. రామేశ్వరం ఆలయంలోని అన్ని శాసనాలు ఈ రామసేతు 1480 వరకు నీటి పైన ఉందని.. తుఫాను సమయంలో మునిగిపోయిందని చూపిస్తుంది.
భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ బ్రిడ్జి పొడవు 29 కి.మీ. మేర ఉంది. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి ఎనిమిది మీటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయవ్య దిశ వరకు విస్తరించి ఉంది. దీనిని నీటి పై తేలియాడే సున్నపురాతితో నిర్మించినట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ సేతువు 99.98 శాతం నీటిలో మునిగిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.