Ram Charan New Title : మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఇటు చిరంజీవి ‘మెగా’ పవన్ కళ్యాణ్ ‘పవర్’ కలుపుకొని మెగా పవర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఈ ట్యాగ్ ఫైనే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ బిరుదు మార్చాలని అనుకుంటున్నారు. దాని స్థానంలో మరోటి తీసుకురాబోతున్నారు.
ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఇది కూడా భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కబోతోంది. రామ్ చరణ్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల జరిగిన ముహూర్తం షాక్ కు మెగాస్టార్ చిరంజీవితో పాటు తమిళ్ డైరెక్టర్ శంకర్, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అతిథులుగా హాజరయ్యారు. సినిమాకు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చివరి దశకు చేరుకుంది. అయితే దీని కన్నా కూడా ఎక్కువగా ఆడియన్స్ బుచ్చిబాబు సినిమాపై ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఈ సినిమాకు ఇంతలా హైప్ వచ్చేందుకు కాస్టింగ్ కూడా కారణం అని తెలుస్తోంది.
ముహూర్తం షాట్ లో ఇంట్రస్టింగ్ పాయింట్ కనిపించింది. రామ్ చరణ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత అంటే మగధీర నుంచి అభిమానులు ఆయనను మెగా పవర్ స్టార్ అంటూ పిలుచుకుంటున్నారు. దీంతో సినిమా టైటిల్ కార్డ్స్‌లో, పోస్టర్స్‌లో కూడా రామ్ చరణ్ పేరు ముందు మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ ఉండేది. ఇప్పుడు అది ఆగిపోయింది.
బుచ్చిబాబు సానా చిత్రం #RC16 పూజా కార్యక్రమం నుంచి రామ్ చరణ్ కు కొత్త ట్యాగ్ ను అఫీషియల్ గా కన్ఫమ్ చేశారు. మైత్రీ మూవీస్ సంస్థ అఫీషియల్ గా పోస్టర్స్, పూజా కార్యక్రమం వీడియోల్లో రామ్ చరణ్ పేరు ముందు ‘గ్లోబల్ స్టార్’ అనే ట్యాగ్ వచ్చి చేరింది.
రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్ కి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఫ్యాన్స్ కూడా గ్లోబల్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఇక వారి కోరిక మేరకు నడుచుకున్నారో ఏమో ‘గ్లోబల్ స్టార్’ అనే ట్యాగ్ కు అర్హుడు అని భావించారో తెలియదు కానీ అధికారికంగా కన్ఫమ్ చేశారు.
గతంలో తండ్రిలో మెగా.. బాబాయ్ లో పవర్ కలిపి వచ్చిన మెగా పవర్ స్టార్ ఇక రాను రాను కనుమరుగవుతుందన్నమాట. ఈ కొత్త బిరుదు చరణ్ కు ఎంతలా కలసి వస్తుందో చూడాలి. గేమ్ ఛేంజర్ టైటిల్ వీడియోలో కూడా మెగా పవర్ స్టార్ అనే ఉంది. బుచ్చిబాబు సినిమా నుంచే ఇది మారుతోంది.
కాబట్టి ఇండస్ట్రీలో అందరూ బుచ్చిబాబు మామూలోడు కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ బిరుదు కూడా యంగ్ టైగర్ నుంచి ‘మాన్ ఆఫ్ మాసెస్’కు మారిపోయింది. అల్లు అర్జున్ బిరుదు స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారింది.