Viral Video : ‘‘బటన్లు నొక్కి మీరిచ్చిందెంత బోడి..’’ వైసీపీ నేతలను లెక్కలతో చిత్తు చేసిన రాజేశ్వరి.. వైరల్ వీడియో
Viral Video : ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతల ప్రసంగాలు ఘాటెక్కుతున్నాయి. ఇప్పటికే అధినేతలు అందరూ ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో ఒక్క క్షణం కూడా తీరికగా ఉండడం లేదు. అభ్యర్థుల తరుఫున ప్రచారం చేయడానికి సతీమణులు సైతం రంగంలో దిగుతున్నారు. అలాగే అధినేతల తరుఫున కుటుంబ సభ్యులందరూ జనాల్లోకి వెళ్తున్నారు. ఇలా ఏపీలో ఎటు చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. ప్రజల్లో ప్రత్యక్షంగా ప్రచారం చేయడంతో పాటు సోషల్ మీడియా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పడం కన్నా ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోయడం, వారిని ఇరుకున పెట్టే వీడియోలు, మీమ్స్, ఆర్టికల్స్ నే క్రియేట్ చేస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేలా వైసీపీ ప్రచారం చేయిస్తోంది. ఇక జగన్ గత ఐదేళ్లుగా చేసిన పాపాలను ప్రజల ముందు టీడీపీ, జనసేన ఉంచుతున్నాయి.
తాజాగా టీడీపీ చేయించిన ఓ షార్ట్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓటు వేయమని ఇంటికి వచ్చిన వైసీపీ నాయకులతో గృహిణి రాజేశ్వరి లెక్కలతో వారిని చిత్తు చేస్తుంది. ఆమె లెక్కల చిట్టాకు దెబ్బకు ఠా.. దొంగల ముఠా అన్నట్టు వైసీపీ నాయకులు అక్కడి నుంచి పరుగందుకున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
వైసీపీ నేతలు గృహిణి రాజేశ్వరి ఇంటికి వచ్చి..అక్కా జగన్ ప్రభుత్వం వల్ల ఈ ఐదేళ్లలో అమ్మఒడి, ఆటో నేస్తం పథకాలతో లక్షా రెండు వేల లబ్ధి చేకూరింది. కనుక జగన్ కే మీరు ఓటు వేయాలని డిమాండ్ చేస్తారు. దీంతో రాజేశ్వరికి మండుకొచ్చి.. ఒక్క నిమిషం ఆగడండంటూ ఇంట్లోకి వెళ్లి ఓ పేపర్ ను తీసుకొచ్చి..ఈ ఐదేండ్లలో బటన్ నొక్కి మాకు ఇచ్చింది ఎంతో చెప్పావు..మరి ఈ ఐదేళ్లలో మా నుంచి జగన్ లాగింది ఎంతో చెప్తా అని జగన్ ప్రభుత్వం తమ ఇంటి నుంచి ఎంత లాగాడో ఒక్కొక్క దాని గురించి పూసగుచ్చినట్టు చెబుతుంది.
ఒక్క మా కుటుంబం నుంచే జగన్ ప్రభుత్వం 11 లక్షల దాక గుంజింది. మాకు ఇచ్చింది లక్షా రెండు వేలు. బటన్లు నొక్కి మాకు ఇచ్చిందేంటి బోడి..అంటూ వారిని ఈసడించుకుంటుంది. దీంతో వైసీపీ నాయకులు మీ ఇంటికి వచ్చే పథకాలను ఆపుతాం..మీ ఇంటిని కూల్చేస్తాం అంటూ భయపెడుతారు. అయితే వారి మాటలకు భయపడని రాజేశ్వరి మేం మా చంద్రన్నకే ఓటు వేస్తాం..వచ్చేది బాబే..ఇచ్చేది బాబే..అంటూ వారికి గట్టిగా బుద్ధి చెపుతుంది. దీంతో వైసీపీ నాయకులు తలలు కిందికి దించుకుని అక్కడ్నుంచి పరుగో పరుగు..