Rajasthan Royals : ముల్హాన్ పూర్ లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన తక్కువ స్కోరింగ్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపగా.. హిట్ మెయిర్ షోతో చివరకు రాజస్థాన్ రాయల్స్ గట్టెక్కింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు పంజాబ్ ను 147/8 పరుగులకే కట్టడి చేసింది. బ్యాటింగ్ లో సమష్టిగా విఫలమైన పంజాబ్ బ్యాటర్లు రన్స్ చేయడానికి అపసోపాలు పడ్డారు.
చివర్లో అశుతోష్ శర్మ మూడు సిక్సులు, ఒక ఫోర్ తో 16 బంతుల్లోనే 30 పరుగులు చేసి జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. అతడు విధ్వంసం సృష్టించకపోతే ఆ మాత్రం స్కోరు కూడా పంజాబ్ చేసేది కాదు. రాజస్థాన్ బౌలర్లో కేశవ్ మహారాజ్, అవేశ్ ఖాన్ రెండేసి వికెట్లు తీయగా.. కుల్ దీప్ సేన్, చాహల్, బౌల్ట్ ఒక్కో వికెట్ తీశారు. అయిదుగురు బౌలర్లకు వికెట్లు దక్కడం ఈ మ్యాచ్ లో విశేషం.
అనంతరం చేధనకు దిగిన రాజస్థాన్ కు మంచి ఆరంభమే లభించినా మధ్యలో పంజాబ్ బౌలర్లు పుంజుకుని మ్యాచ్ ను ఆసక్తి రేకేత్తించారు. వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకున్న రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ను మీదకు తెచ్చుకుంది.
యశస్వి జైస్వాల్ 39 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చివరి ఓవర్లో ఆరు బంతులకు 10 పరుగులు కావాల్సిన సమయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో సిమ్రాన్ హిట్ మెయిర్ చెలరేగి ఆడి ఆఖరి ఓవర్ అయిదో బంతికి సిక్స్ కొట్టి గెలిపించాడు.10 బంతుల్లోనే 27 పరుగులు చేసిన హిట్ మెయిర్ రాజస్థాన్ కు మరో విజయం ఖాతాలో చేరేలా చేశాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్స్ టేబుల్స్ లో ఆరు మ్యాచ్ ల్లో అయిదు విజయాలతో అగ్రస్థానం నిలబెట్టుకోగా.. పంజాబ్ ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు శిఖర్ దావన్ గాయపడడంతో మ్యాచ్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో సామ్ కర్రన్ పంజాబ్ కు కెప్టెన్ గా వ్యవహారించాడు.