Rajamouli : సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖారారు కానీ ఈ సినిమా వర్కింగ్ టైటిల్ #SSMB29గా ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి తన టీమ్ లో అనూహ్యమైన మార్పులు చేస్తున్నట్లు తెలిసింది. గత సినిమాలలో ఆయనతో కలిసి పని చేసిన వారు ఈ సినిమాలో పని చేయడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైంది.
రాజమౌళి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా గతంలో పని చేసిన సెంథిల్ కుమార్ స్థానంలో ఇప్పుడు పీఎస్ వినోద్ ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రాజమౌళి టీంలో కీలకంగా గుర్తింపు సంపాదించుకున్న వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ శ్రీనివాస మోహన్ స్థానంలో కమల్ కన్నన్ ను తీసుకోనున్నారు.
ఎడిటర్ శ్రీఖర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్‌కు ప్రత్యామ్నాయాలను వెతికే పనిలో రాజమౌళి ఇప్పుడు బిజీగా ఉన్నారట. అయితే పాత మ్యూజిక్ డైరెక్టర్, రాజమౌళి సోదరుడు ఎంఎం కీరవాణినే #SSMB29కి కూడా సంగీతం అందిస్తున్నారట.
అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ బడ్జెట్ తో #SSMB29ను భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఆఫ్రికన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజ్యసభ సభ్యుడు కేవీ విజయేంద్రప్రసాద్ కథ అందించారు. మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని రాజమౌళి తెలిపారు.
అయితే, అన్ని సినిమాలలా కాకుండా ఈ సినిమాను వీలైనంత వేగంగా చిత్రీకరించి ప్రేక్షకుల ముందుకు తెస్తానని రాజమౌళి మాటిచ్చారు. సాధారణంగా రాజమౌళి సినిమాలను సంవత్సరాలు తీస్తుంటారు. అందుకే ఆయనకు టాలీవుడ్ జక్కన్న అని గుర్తింపు వచ్చింది. తక్కువలో తక్కువగా 2 సంవత్సరాల వరకు ఒక సినిమా తీస్తారు ఆయన. ఇక బాహుబలికి మూడేళ్లకు పైగా పట్టింది. ఇది ప్రేక్షకులను కొంత అసహనానికి గురి చేస్తుందని గ్రహించిన దర్శక ధీరుడు ఈ సినిమాను వేగంగా చేస్తానని చెప్పడం కొంత వరకు ఆనందమనే చెప్పాలి.