Rajaiah : రాజయ్య రావయ్యా..నువ్వే దిక్కయ్యా..
Rajaiah : వరంగల్ లోక్ సభ నుంచి పోటీ చేయాల్సిన కడియం కూతురు కావ్య ఉన్నపళంగా కారు దిగి వెళ్లిపోయారు. దీంతో కేసీఆర్ ఇప్పుడు మరో అభ్యర్థిని వెతుక్కోవాల్సి వస్తోంది. టికెట్ కోసం చాలా మంది రేసులో ఉంటున్నారు కానీ పోటీ ఇస్తారు అనుకున్న వారంతా జంప్ అవుతున్నారు. సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ఉన్నా ఆయనకు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ అనుకోలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
కేసీఆర్ మొదట ఎంపీ సీటును వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కు ఇద్దామనుకున్నారు. కానీ బీజేపీలో చేరిపోయి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆపేందుకు ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. కడియం కూడా పార్టీ మారుతారన్న ప్రచారం జరుగడంతో ఆయన కుమార్తెకు టికెట్ ప్రకటించారు. కానీ వర్కవుట్ కాలేదు. కడియం కోసం తాటికొండ రాజయ్యను అంతకుముందే పక్కకు పెట్టడంతో అందరికంటే ముందే ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
కానీ రాజయ్యను కాంగ్రెస్ లో చేర్చుకోలేదు. రేవంత్ రెడ్డిని రెండు, మూడు సార్లు కలిసినా ప్రయోజనం లేకపోయింది. ఆయన పేరును కాంగ్రెస్ పరిగణలోకి తీసుకోలేదు. ప్రస్తుతం రాజయ్య పరిస్థితి అటూ ఇటూ కాకుండా అయిపోయింది. ఇప్పుడు రాజయ్యనే పిలిచి టికెట్ ఇస్తే బ్యాలెన్స్ అవుతుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అయితే బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా తమకు చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారో తెలియదు.
వాస్తవానికి వరంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రెండు సార్లు, అంతకంటే ఎక్కువసార్లు గెలిచి ప్రజల్లో వ్యతిరేకతను మూటకట్టుకున్నారు. బీఆర్ఎస్ క్యాడర్ బాగా ఉన్నప్పటికీ జనాలు మార్పు కోరుకున్నారు. అభ్యర్థులను మారిస్తే మంచి ఫలితాలే వచ్చేవి. ఒక్క స్టేషన్ ఘన్ పూర్, జనగామ మాత్రమే మార్చగా అక్కడ సత్ఫలితాలనే పొందారు.
మిగతా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులంతా ఓడిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత లోక్ సభ ఎన్నికల్లో కూడా ఉంటుందని చెప్పలేం. కడియం కావ్య, అరూరి ఇతర పార్టీల్లోకి వెళ్లగా వారి వైఖరిపై జనాల్లో వ్యతిరేకత కనపడుతోంది. బీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్థి నిలబడితే వారికి గట్టిపోటీ ఇవ్వొచ్చని అంటున్నారు.