Telangana Rains : తెలంగాణలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని చెప్పారు. బుధవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈశాన్య దిక్కులో కదులుతోంది. గురువారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న దక్షిణ బంగాళాఖాతం ప్రాంతంలో స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా కొనసాగుతోంది. అది ఈశాన్యం వైపు కదిలి ఈనెల 24న మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.
వాయుగుండం ఈశాన్య దిక్కులోనే ప్రయాణించి మరింత బలపడి ఈనెల 25న ఉదయం తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తుపానుగా మారనుంది. అనంతరం ఉత్తర దిక్కులోనే ముందుకు కదిలి మరింత బలపడి తీవ్ర తుపానుగా మారి ఈ నెల 26 నాటికి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు వెల్లడించారు.