Nandyala District : నంద్యాల జిల్లాలో తెల్లవారు జామున 3 గంటల నుంచి కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. గాలులకు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. రేకుల షెడ్లు ఎగిరి 20 అడుగుల దూరంలో పడిపోయాయి. చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో తెల్లవారు జాము నుంచి పలు గ్రామాల్లో విద్యుత్ నిలిచిపోయింది.
సంజమల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. అవుకు మండలంలో కూడా తేలికపాటి వర్షాలు కురిశాయి.
ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాలలో గాలివాన వడగండ్లతో బీభత్సం సృష్టించింది. మండల పరిధిలోని ముష్టిపల్లె, సిద్థపల్లె, పెద్ద అనంతపురం, నల్లకాల్వ గ్రామాల్లో వడగండ్ల ధాటికి పక్షులు విలవిలలాడాయి. కొన్ని పక్షులు చనిపోగా.. మరికొన్ని పక్షులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. కొంగలు, రామచిలకలు చనిపోతుండడంతో పక్షుల ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.