Rahul Gandhi : యూపీ హత్రాస్ లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన బాధితులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. జూలై 2న హత్రాస్ లో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనాలు పాల్గొన్నారు. అనంతరం జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వందల మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈరోజు (శుక్రవారం) మృతుల కుటుంబాలను రాహులు గాంధీ కలిసి పరామర్శించారు. యూపీలోని అలీఘర్ జిల్లా ఫిలక్నా గ్రామంలోని బాధితుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. ప్రమాద వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆదుకుంటామని చెప్పారు.
అనంతరం రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ ‘‘చాలా కుటుంబాలు ప్రభావితమయ్యాయి. చాలా మంది మరణించారు. నేను దీనిని రాజకీయం చేయదల్చుకోలేదు. వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. చాలా నిరుపేద కుటుంబాలైనందున వారికి మరింత పరిహారం ఇవ్వాలని కోరుతున్నా’’ అని అన్నారు.