Rahul Jodo Nyay Yatra : నేటి నుంచే రాహుల్ జోడో న్యాయ్ యాత్ర..అక్కడ పాగా వేసేందుకే..
Rahul Jodo Nyay Yatra : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేడు భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి దీన్ని ప్రారంభించనున్నారు. ఈ యాత్రకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రీసెంట్ గా కాంగ్రెస్ లో చేరిన షర్మిల కూడా ఈ యాత్రలో పాల్గొనబోతున్నారు.
గతంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జోడో యాత్ర చేపట్టారు. అది దిగ్విజయంగా సాగింది. ఈ యాత్ర రాహుల్ క్రేజ్ పెరిగింది. ఇక జోడో యాత్ర జరిగిన రాష్ట్రాల్లో కర్నాటక, తెలంగాణల్లో ఆ పార్టీ అధికారంలోకి కూడా వచ్చింది. మరో రెండు, మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి మరింత మైలేజ్ తెచ్చేందుకు రెండో సారి పాదయాత్ర చేసేందుకు రాహుల్ సిద్ధమయ్యారు. గత యాత్ర దక్షిణ కొస నుంచి ఉత్తర కొసకు సాగింది. ప్రస్తుత జోడో న్యాయ్ యాత్ర తూర్పు నుంచి పడమరకు సాగనుంది. దీంతో భారత్ లోని ప్రధాన రాష్ట్రాలను కవర్ చేసినట్టు అవుతుంది.
అయితే ఈ యాత్రను నిర్వహించడానికి ప్రధాన కారణం..కేంద్ర ప్రభుత్వ నియంత పోకడ, నిరుద్యోగం, ధరల పెరుగుదల, సామాన్యులకు న్యాయం, సామాజిక న్యాయం.. వంటి అంశాలపై ప్రజల్లో చర్చకు తెచ్చేలా బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, వారి వైఫల్యాలను ప్రజలకు చెప్పడానికి చేపడుతున్నారు.
కాగా, గత జోడో యాత్రను రాహుల్ మొత్తం పాదయాత్ర ద్వారానే పూర్తి చేశారు. కానీ ప్రస్తుత యాత్ర నడకతో పాటు పలుచోట్ల వాహనాల్లో ప్రయాణిస్తూ చేపడుతారు. ఎందుకంటే మరి కొద్ది రోజుల్లోనే లోక్ సభ ఎన్నికలు ఉండడం. అందుకే ఈ యాత్రను తొందరగా పూర్తిచేసేలా ప్లాన్ చేశారు.
ఈ యాత్ర ద్వారా రాహుల్ ఆశిస్తున్నది ఏంటంటే..గత యాత్ర రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో పాటు బీజేపీకి ప్రత్నామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని నిరూపించగలిగింది. రాజస్థాన్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో అధికారం నిలుపుకుంటే మరింత మైలేజీ వచ్చేదే.. ఇక అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని చూస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఉత్తరాది రాష్ట్రాల్లోనూ, తూర్పు, పశ్చిమ రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు తెచ్చుకోవడం ఆ పార్టీకి చాలా అవసరం. అందుకే ఈ యాత్రను రాహుల్ కీలకంగా చేపడుతున్నారు. ఎక్కువ రోజులు ఉత్తరప్రదేశ్ లోనే కొనసాగించనున్నారు. దక్షిణాదిలో కాంగ్రెస్ లో బలంగానే ఉన్నా ఉత్తరాదిలో సాధించే సీట్లే కాంగ్రెస్ ను అధికారంలోకి తెప్పించగలుగుతాయి. అందుకే ఉత్తరాదిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.