PM Modi : దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా ఉంటారన్న రాహుల్ సన్నిహితుడు.. మోదీ గట్టిగానే ఇచ్చిపడేశాడు..
PM Modi : బీజేపీ ప్రభుత్వాన్ని మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని నానా తంటాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారిపోతోంది. బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల నుంచి మరింత తిరస్కరణకు గురవుతున్నారు. ప్రజలు ఓడించడం కాదు వారికివారే ఓటమికి మరింత దగ్గరవుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిన మాట్లాడి బీజేపీ నేతలకు ఎన్నికల ప్రచారంలో మంచి స్టఫ్ అందిస్తున్నారు. దీంతో బహిరంగ సభల్లో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను మోదీ, అమిత్ షా ఆయుధాలుగా మార్చుకుంటున్నారు.
భారత్ లో వారసత్వ పన్ను విధానం అమలును సూచించి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా మరో పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు దేశంలో దుమారం రేపుతున్నాయి. దేశ గొప్పతనం గురించి మాట్లాడుతూ..ఆయన దేశ ప్రజల పోలికలను పోల్చుతూ పెద్ద వివాదానికి కారణమ్యారు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే..‘‘ తూర్పు భారతంలోని ప్రజలు చైనీస్ లా ఉంటారు..పశ్చిమాన ప్రజలు అరబ్బుల్లా, ఉత్తరాది వారు తెల్లగా, దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా ఉంటారు.. అయినా అందరం కలిసే ఉంటున్నాం’’ అని చెప్పుకొచ్చారు.
ఆయన వ్యాఖ్యలపై దేశంలోని అన్ని ప్రాంతాల వారు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై వరంగల్ బహిరంగ సభలో ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఆదివాసీ బిడ్డ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి చేస్తామంటే కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించిందో నాకు ఇప్పుడు అర్థమైంది. అమెరికాలో యువరాజు(రాహుల్) అంకుల్(శ్యామ్ పిట్రోడా) ఉంటారు. ఆయన దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా ఉంటారని తన జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఇది నాకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. చర్మం రంగును బట్టి ప్రజలను వర్గీకరిస్తారా? ఇది మోదీ ఉండగా జరగదు.’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పిట్రోడా వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.