Raging : ఏపీలోని పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో ఉన్న ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ర్యాగింగ్ భూతం బయటపడింది. సీనియర్ విద్యార్థులు జూనియర్లను పిరుదులపై కొడుతూ దారుణంగా హింసిస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. డిగ్రీ కాలేజీలోని సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను హాస్టల్ రూమ్స్ లోకి రాత్రి పిలిచి దారుణంగా కర్రలతో పిరుదుల మీద బాదుతూ రాక్షసానందం పొందారు.
కాగా.. ఈ ఘటన గత ఫిబ్రవరిలో జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కాలేజీలో ఎన్సీసీ ఉండటం వల్ల అనేక మంది స్టూడెంట్స్ ఇక్కడ చేరేందుకు ఆసక్తి చూపుతారు. కాగా ర్యాగింగ్ జరిగిన విధానం గురించి తెలియడంతో స్టూడెంట్స్, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరీ ఇంత ఘోరంగా, దారుణంగా హింసిస్తున్నారు. అసలు చదువుకోవడానికి వెళ్లారా.. రౌడీయిజం నేర్చుకోవడానికి వెళ్లారా.. వీరి కన్నా రాక్షసులు నయం అంటూ విమర్శిస్తున్నారు.
కాలేజీల్లో ర్యాగింగ్ భూతం అరికట్టకపోతే అనేక మంది విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోతాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై నరసరావుపేట సీఐ, ఎస్ఐ లు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి ఈ దాడి ఎప్పుడు జరిగింది. ఇలా ఎన్ని సార్లు జూనియర్లను హింసించారు. ర్యాగింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
గతంలో ర్యాగింగ్ భూతం వల్ల అనేక మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్న సంఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ర్యాగింగ్ వల్ల అనేక మంది చదువులకు దూరం కావడం, కొంతమంది వెనకబడిపోవడం మరి కొందరు సూసైడ్ చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ర్యాగింగ్ భూతంపై కఠిన చర్యలు తీసుకుంటేనే మరొకరు దీని బాట పట్టకుండా ఉంటారని అంటున్నారు. ఎస్ఎస్ఎన్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటన హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపాల్ కు తెలిసినా కూడా పట్టించుకోలేదని ఏదైనా తమకే ఇబ్బంది కలుగుతుందని హాస్టల్ నుంచి వెళ్లగొడతారని ఆందోళన చెందిన జూనియర్స్ కంప్లైంట్ ఇవ్వలేదని తెలుస్తోంది.