Raghurama : రఘురామ పోటీ ఎక్కడో? కూటమి సీట్ల మార్పు తప్పదా?
Raghurama : ఏపీ ఎన్నికల వేడి రాజుకుంది. పార్టీల అభ్యర్థుల ప్రకటన తర్వాత అధినేతలు అందరూ ప్రచారంలో బిజీబిజీ అయిపోయారు. అయితే కూటమిలో సీట్ల సర్దుబాటులో కొత్త మార్పులు తెర మీదకు వస్తున్నాయి. మూడు పార్టీల సీట్ల లెక్కల్లో మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే ఖరారైన కొన్ని సీట్లలో మార్పు ఖాయంగా కనిపిస్తోంది.
వైసీపీలో రెబల్ స్టార్ రఘురామ కృష్ణంరాజు. మొదటి నుంచి వైసీపీపై పోరాటమే అతడి నైజం. దీంతో సొంత పార్టీలోనే కుంపటి పెట్టిన నేతగా గుర్తింపు పొందారు. ఏపీలో పొత్తుల్లో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు సీట్లు పంచుకున్నాయి. దీంతో ఏలూరు, నర్సాపురం విషయంలో ఇప్పుడు చర్చ నడుస్తోంది. వీటి విషయంలోనే రెండు పార్టీలు పట్టుబడుతున్నాయి.
ఏలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పుట్ట మహేశ్ యాదవ్ కు అవకాశం ఇచ్చారు. ఇతడు యనమల అల్లుడు. ఆయన కుటుంబంలో నలుగురికి టికెట్లు ఇచ్చారు. నిజానికి మొదట ఏలూరు సీటు బీజేపీకి కేటాయిస్తారని అనుకున్నారు. కానీ టీడీపీ ఖాతాలోకి వెళ్లింది. దీంతో ఇప్పుడు నర్సాపురం బీజేపీకి కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నర్సాపురం టికెట్ బీజేపీకి కేటాయిస్తే గొడవ ఉండేది కాదు. అంతా సవ్యంగా సాగిపోయేది. నర్సాపురం ఇవ్వకపోయినా వేరే నియోజకవర్గాన్ని కేటాయించినా బాగుండేది. కానీ అలా జరగలేదు. దీంతో ఇప్పుడు నర్సాపురం టికెట్ వ్యవహారం గందరగోళంలో పడింది. రఘురామకు టికెట్ ఎక్కడ ఇస్తారనే వాదన మొదలైంది. రఘురామకు టికెట్ ఇవ్వకపోతే జగన్ వర్గం రెచ్చిపోతుంది.
దీంతో ఇప్పుడు నర్సాపురం విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు. మొత్తానికి రఘురామకు మాత్రం టికెట్ ఇవ్వకపోతే అది వీరికే నష్టం. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల్లో రఘురామకు టికెట్ ఖాయమనుకున్న సందర్భంలో ఆయనకు సీటు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఎక్కడ టికెట్ ఇస్తారో చూడాల్సిందే. ఆయన మాత్రం పోటీలో కచ్చితంగా ఉంటానని చెప్తున్నారు. మరి రఘురామ కోసం కూటమి పార్టీలు ఏం చేస్తాయో చూడాలి.