JAISW News Telugu

Raghavendra Rao : తెలుగు సినిమాకు కమర్షియల్ సొబగులు అద్దిన దర్శకేంద్రుడు..రాఘవేంద్రుడు

Raghavendra Rao

Raghavendra Rao

Raghavendra Rao : రాఘవేంద్ర రావు ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. నేడు లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్ర రావు పుట్టిన రోజు. తెలుగుతో పాటు పలు భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి  ఇండస్ట్రీ చరిత్రలో తనకంటూ  ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసుకున్నారు. రొమాంటిక్ పాటలకు ఆయన పెట్టింది పేరు. భక్తిరస సినిమాలు తీయడంలోనూ దర్శకేంద్రుడు దిట్ట. అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు.

ఇక రాఘవేంద్ర రావు ప్రతిభకు ఎన్నో అవార్డులు ఆయనను వరించాయి. ఆయన ప్రస్తుతం సినిమాలు చాలా వరకు తగ్గించారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి, నేటి జనరేషన్ హీరోలైన అల్లు అర్జున్ వరకూ ఎంతోమంది హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. అలాగే ఆయన వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళని తెలుగు సినిమాకి హీరోలుగా ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే దివంగత నటి  శ్రీదేవి, కుష్బూ, టబు, దీప్తి భట్నాగర్, శిల్ప శెట్టి, తాప్సీ లాంటి ఎంతోమంది హీరోయిన్లకు సినీ కెరీర్ ప్రసాదించారు.

దర్శకేంద్రుడు మొత్తం ఎనిమిది నంది పురస్కారాలు, ఒక ఐఐఎఫ్ఏ పురస్కారం, ఒక సైమా అవార్డు, ఐదు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు, రెండు సార్లు సినీ మా అవార్డులు అందుకున్నారు. దర్శకుడిగా ఆయన మొదటి చిత్రం బాబు ఈ సినిమా 1975లో వచ్చింది. ఈ చిత్రంలో శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలు తీశాడు. స్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమె కథ, కల్పన లాంటి సినిమాలను తెరకెక్కించాడు.  అతిలోక సుందరి శ్రీదేవితో రాఘవేంద్రరావు 24 సినిమాలు చేశారు. కేవలం వెండితెర మీదే కాక బుల్లితెర మీద కూడా ఆయన తన ముద్ర వేశారు. ఈటీవీలో ప్రసారమైన శాంతి నివాసం అనే సీరియల్ కు రచయిత, దర్శకత్వ పర్యవేక్షకుడిగా పనిచేశారు రాఘవేంద్రరావు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సినీ రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెష్ చెబుతున్నారు.

Exit mobile version