Modi affidavits : మోదీ అఫిడవిట్లపై రగడ.. భార్య గురించి ఏం చెప్పారంటే..
Modi affidavits : ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో అగ్రనేత. ఆయన చరిష్మా ఖండాంతరాలు దాటింది. బీజేపీ శ్రేణులు ‘విశ్వగురు’గా కీర్తించే మోదీ ప్రపంచంలోనే శక్తివంతమైన నాయకుడు. కోట్లాది మంది ఆయన ఫాలోవర్స్ గా ఉన్నారు. ఓటమి ఎరుగని నేతగా ఆయన కీర్తి శిఖరస్థాయిలో ఉంది. గుజరాత్ సీఎంగానే కాదు దేశ ప్రధానిగా ఆయన రాజకీయ ప్రభ ఎవరికీ అందనంత స్థాయిలో ఉంది. దేశానికి పది సంవత్సరాలు ప్రధానిగా ఉండడమే కాదు మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతానని ధీమాగా ఉన్నారు.
దేశమే ఆయన కుటుంబమని బీజేపీ శ్రేణులు ఆరాధించే మోదీకి ప్రతిపక్షాల విమర్శలు అదే స్థాయిలో ఉన్నాయి. నరేంద్ర మోదీకి వివాహితుడని అందరికీ తెలిసిందే. ఆయన భార్య జశోదబెన్ అని, ఆమె గుజరాత్ లో ఉంటుందని చెప్తారు. మోదీ భార్య గురించి అనేక కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. ఈ విషయంపై ప్రతిపక్షాలు మోదీని విమర్శిస్తూనే ఉంటాయి. ఆయన అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలు ఒక్కో సారి ఒక్కోలా ఉండడంతో తీవ్ర ఆరోపణలు చేస్తుంటాయి.
తాజాగా నరేంద్ర మోదీ వైవాహిక స్థితిపై, ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించిన అఫిడవిట్లపై కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించింది. ‘‘మేము ఎన్నికల కమిషన్ కు ఒక విజ్ఞప్తి చేశాము. వడోదర(గుజరాత్ లోని లోక్ సభ నియోజకవర్గం)లో తన అఫిడవిట్ లో నరేంద్ర మోదీ తనకు వివాహమైనట్లు తెలియజేశారు. అంతకుముందు ఆయన అఫిడవిట్ లలో ఏదీ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. అందుకే ఆ అఫిడవిట్ తప్పని రుజువైంది’’ అని ఫిర్యాదు చేసిన తర్వాత కాంగ్రెస్ కపిల్ సిబల్ అన్నారు.
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ లోక్ సభ ఎన్నికల అఫిడవిట్ లో తొలిసారిగా తనకు వివాహమైనట్లు ప్రకటించారు. వడోదరలో నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న సందర్భంగా మోదీ అఫిడవిట్ లో తన భార్య పేరుగా జశోదాబెన్ అని రాశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు అఫిడవిట్ లలో మోదీ వివాహ కాలమ్ ను ఖాళీగా ఉంచారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. మోదీ గతంలో ఇచ్చిన అఫిడవిట్ లు అబద్ధమని ఇప్పుడు రుజువైందని, తప్పుడు అఫిడవిట్ ల కేసును పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరుతోంది. ‘‘చట్టం ప్రకారం మోదీ తన జీవిత భాగస్వామి పేరును పేర్కొనలేదు’’ అని కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ అన్నారు. ‘‘ఇది వ్యక్తిగత సమస్య కాదు న్యాయపరమైన సమస్య’’ అని అన్నారు.
ఇదిలా ఉండగా 2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ అఫిడవిట్ పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందులో ఆయన భార్య ఎవరు అనే విషయంపై ‘తెలియదు’ అని రాశారు. అలాగే ఆమె చిరునామా, ఆస్తులు, ఇన్సురెన్స్ తెలియజేయలేదు. గతంలో తన భార్య పేరు జశోదాబెన్ పేర్కొన్న ఆయన ఈ అఫిడవిట్ లో ఆమె గురించి ఏ సమాచారం ఇవ్వలేదు. కనీసం కలిసి ఉంటున్నారా? విడాకులు తీసుకున్నారా? అనే విషయాలు కూడా తెలియజేయలేదని అంటున్నారు. ఈ విషయాలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, మోదీ మరోసారి పోటీ చేయబోయే వారణాసిలో 7వ దశలో జూన్ 1న ఎన్నికలు జరుగబోతున్నాయి. మరి ఈసారి ఆయన అఫిడవిట్ లో తన భార్య గురించి వివరాలను అందిస్తారా? లేదా? అనేది చూడాలి. ఆయన ఏ సమాచారం ఇచ్చినా దానిపై ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి. తన భార్య వివరాలపై అఫిడవిట్లలో వివిధ రకాలుగా సమాచారం ఇవ్వడం నేరమని, ఆయన అభ్యర్థిత్వాన్ని కొట్టివేయాలని కోరే అవకాశం ఉంది.