Ongole YCP : ఒంగోలు వైసీపీలో రగడ.. బాలినేని ఫోన్ స్విచ్ఛాఫ్..అసలేం జరుగుతోంది..?
Ongole YCP Politics : వైసీపీ అధినేత, సీఎం జగన్ కు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నమ్మిన బంటు. సీఎం కుటుంబ సభ్యులతోనూ చెవిరెడ్డికి అత్యంత సాన్నిహిత్యం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుంగు శిష్యుడైన చెవిరెడ్డి, వైఎస్ మరణం తర్వాత జగన్ కు దగ్గరయ్యారు. చంద్రగిరిని తన అడ్డాగా మార్చుకున్నారు. సీనియర్ నేత గల్లా అరుణకుమారిని ఓడించడం ద్వారా చెవిరెడ్డి సీఎం జగన్ రెడ్డికి మరింత దగ్గరయ్యారు. 2014లో తొలిసారి చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అప్పటి టీడీపీ ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు.
చెవిరెడ్డి తన స్థానం చంద్రగిరి నుంచి ఈ సారి ఎన్నికల్లో తన కొడుకును రంగంలోకి దించనున్నారు. ఈమేరకు జగన్ టికెట్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పేరును అధిష్ఠానం ఫైనల్ చేసింది.
వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో పలువురు సిట్టింగ్ లను మార్పు చేయాలని జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేనిని ఖరారు చేశారు. ఎంపీగా మాగుంటను తప్పించాలని డిసైడైన జగన్ చెవిరెడ్డికి టికెట్ ఖరారు చేశారు. అయితే మాగుంటను కొనసాగించాలని పార్టీ హైకమాండ్ పై ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. చెవిరెడ్డి స్థానికేతరుడని ఆయన్ను ప్రజలు అంగీకరించారని కూడా చెప్పుకొచ్చారు.
ఒంగోలు లోక్ సభతోపాటు పలు అసెంబ్లీ స్థానాల పార్టీ బాధ్యతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించడంపై ఎమ్మెల్యే బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే పార్టీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో బాలినేని ఫోన్ నిన్నటి నుంచి స్విఛ్ ఆఫ్ పెట్టుకున్నారు. పార్టీ కేడర్ కు దూరంగా బాలినేని, ఆయన కుమారుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదే క్రమంలో చెవిరెడ్డి ఫ్లెక్సీలను చించివేయడం వైసీపీలో రగడ పుట్టిస్తోంది.