Qatar : ఖతార్ మెడలు వంచాడు.. మోదీ సాధించాడు
Qatar to India Modi Charisma : ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా.. భారత్ కే పరిమితం కాదు.. అది ఎప్పుడో ఖండాంతరాలు దాటింది. ఇది మరోమారు నిరుపితమైంది. ఖతార్ లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన 8 మంది భారత నేవీ మాజీ అధికారులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. 18 నెలలుగా వీరు అక్కడి జైల్లో ఉన్నారు. గతంలో వీరికి విధించిన మరణ దండనను ఇప్పటికే అక్కడి కోర్టు జైలు శిక్షగా మార్చింది. తాజాగా దాని నుంచి విముక్తి కల్పించి వారిని భారత్ కు అప్పగించారు. ఖతార్ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది.
అసలేం జరిగింది..
గూఢచార్యం ఆరోపణలు కింద 8మంది భారత నౌకాదళ మాజీ సిబ్బందిని 2022లో ఖతార్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో కెప్టెన్లు సౌరభ్ వశిష్ఠ్, నవతేజ్ గిల్, కమాండర్లు బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, అమిత్ నాగ్ పాల్, సెయిలర్ రాగేశ్ ఉన్నారు. వీరిలో సుగుణాకర్ విశాఖ వాసి. అక్కడి ప్రాథమిక కోర్టు రెండు మూడు సార్లు మాత్రమే విచారణ జరిపి మరణశిక్షను ఖరారు చేసింది.
దీన్ని రద్దు చేయించేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరంగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. దీంతో అప్పీలు చేసుకోవడానికి అక్కడి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఎట్టకేలకు విచారణ జరిపిన కోర్టు పూర్తి విచారణ చేసి మరణదండనను జైలు శిక్షగా మారుస్తూ 2023 డిసెంబర్ 28న తీర్పు ఇచ్చింది. దీన్ని కూడా అప్పీలు చేసుకునేందుకు 60 రోజుల గడువు ఇచ్చింది. దీంతో అందుబాటులో ఉన్న అన్ని న్యాయమార్గాలను వినియోగించుకున్న భారత విదేశాంగ శాఖ వారి విడుదలకు గట్టి కృషి చేసింది. దీంతో ఖతార్ వారిని విడుదల చేయకతప్పలేదు. భారత్ దౌత్యపరంగా సాధించిన గొప్ప విజయమిది.
మోదీ వల్లే సాధ్యం..
భారత ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు, ప్రత్యేకంగా ప్రధాని మోదీ చొరవ వల్లే తమ విడుదల సాధ్యమైందని ఢిల్లీకి చేరుకున్న నేవీ మాజీ అధికారులు కొనియాడారు. సోమవారం తెల్లవారుజామున విమానాశ్రయానికి చేరుకున్న వారు ‘భారత్ మాతా కీ జై’ అంటూ పెద్దపెట్టున నినదించారు. ‘‘ఎట్టకేలకు క్షేమంగా ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.. ఆయన వ్యక్తిగత జోక్యం లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఖతార్ పాలకులకు కూడా కృతజ్ఞతలు’’ అని ఓ నేవీ అధికారి చెప్పారు.