PV Narashima Rao : దేశ ఆర్థిక గతిని మార్చిన తెలుగువాడు..!
PV Narashima Rao : దేశ చరిత్ర గతిని మార్చిన గొప్ప దార్శనికుడు పీవీ.. మన మధ్య లేకున్నా ఆయన ప్రారంభించిన సంస్కరణల ఫలితాలు మన కళ్ల ముందు కదలాడుతున్నాయి..చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్న మహోన్నతుడు. ఆయన కష్టానికి, ఆయన మేథస్సుకు ఇన్ని రోజుల తగిన గుర్తింపు రాలేదా అని తెలుగు జనం ఆవేదన చెందారు. రాజకీయ క్రీడలో ఆయన కీర్తిని మరుగున పడేసే ప్రయత్నం చేస్తున్నారా? అని ఆందోళన చెందారు. ఎట్టకేలకు భారత అత్యున్నత పౌరపురస్కారం ‘భారతరత్న’ ప్రకటించడం భారతవని ముఖ్యంగా తెలుగు నేల పులకించిపోయింది. ఆయన చేసిన సేవలను ఓ సారి గుర్తుకుతెచ్చుకుందాం..
పీవీ ప్రధాని అయ్యే సమయానికి దేశం ఆర్థికంగా దివాళా చేసే స్థితిలో ఉంది. దశాబ్దాల తరబడి మనం అనుసరించిన విధానాలకు తోడు అనుకోకుండా వచ్చిపడిన గల్ఫ్ యుద్ధంతో పరిస్థితులు చేయిదాటిపోయాయి. 1982-84 మధ్యలో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన బడ్జెట్లు, 1987లో ప్రధాని రాజీవ్ గాంధీ ప్రకటించిన కొత్త ఆర్థిక విధానంతో ద్రవ్యలోటు పెరిగిపోయింది. నాలుగు వందల మందికి పైగా ఎంపీల బలమున్న రాజీవ్ గాంధీ భవిష్యత్ గురించి, అప్పటికే పడుతున్న ఒత్తిడి గురించి ముందస్తు సమాచారం ఉన్నా మార్పులకు మొగ్గుచూపలేదు. ఆ తర్వాత వచ్చిన వీపీ సింగ్ సైతం ఈ విషయంలో ఏమి చేయలేకపోయారు.
ఫలితంగా 72 బిలియన్ డాలర్ల మేరకు పేరుకుపోయిన విదేశీ రుణాలతో అతి ఎక్కువ అప్పులు ఉన్న దేశాల జాబితాలో మూడో స్థానానికి చేరింది. ఈ గండం నుంచి బయట పడడానికి 67 మెట్రిక్ టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ప్రధాన మంత్రిగా పీవీ వచ్చారు. అప్పటికీ అమలులో ఉన్న మూసపద్ధతులను ఆయన శాశ్వతంగా దూరంగా విసిరేశారు.
ఇక జాతీయ ఉపాధి పథక మూలాలు పీవీ మేధోమథనంలో నుంచి వచ్చిందే అని చెప్పాలి. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణలతో పాటు ‘యాక్ట్ ఈస్ట్’ పాలసీకి ఆయనే ప్రాణం పోశారు. అలాగే విదేశాంగ విధానంలోనూ తనదైన మార్క్ చూపారు. ఒకప్పుడు పాకిస్తాన్ కు అన్ని విధాలా సాయం చేసిన ఇరాన్ ను భారత్ మిత్రదేశంగా మార్చారు.
చైనా, పాకిస్తాన్ రూపంలో ఇరుపక్కలా ఉన్న శత్రువులు పొంచి ఉన్న భారత్ కు అణ్వస్త్ర బలాన్ని అందించి అజేయశక్తిగా మార్చారు. తన ఏలుబడిలోనే అణు పరీక్షలు నిర్వహించినా ఆ ఘనత మొత్తం పీవీదేనని వాజ్ పేయీ వినమ్రంగా అంగీకరించారు.
ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినా పీవీ సంక్షేమానికి అంతే ప్రాధాన్యం ఇచ్చారు. విద్య, వైద్యరంగాలను ప్రభుత్వమే నిర్వహించాలని పీవీ ఎప్పుడూ చెబుతుండేవారు. ఈ రంగాలకు ఆయన ఇతోధికంగా నిధులు కేటాయించారు. ప్రైవేట్ రంగాన్ని బాగా ప్రోత్సహించి, తద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి వెచ్చించాలనే కొత్త మార్గాన్ని ఆయన తీసుకొచ్చారు. ఇలా ఎన్నెన్నో కొత్త మార్పులకు నాంది పలికి విజేతగా నిలిచిన పీవీకి భారతరత్న రావడం సముచితం. పీవీ తెలుగువారి ఠీవీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.