Pushpa2 : మైత్రీ మూవీస్ పతాకంపై యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్, చెరుకూరి మోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించారు. ఈ సినిమా విడుదలవడానికి మరో 32 గంటల సమయమే మిగిలివుంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రలోకన్నా తెలంగాణలోనే టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. మల్టీప్లెక్స్ లో రూ.1200 వరకు నైజాంలో ఉంటే, ఏపీలో రూ.900వరకు మల్టీప్లెక్స్ ధర ఉంది. థియేటర్ లో నైజాంలో రూ.500 వరకు ఉండగా, ఏపీలో రూ.400 వరకు ఉన్నాయి.
పారితోషికం తగ్గించారు
రూ.400 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించినందుకు అల్లు అర్జున్ రూ.300 కోట్ల పారితోషికం తీసుకున్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమాకు ఎంత బిజినెస్ జరిగితే అందులో నుంచి 27 శాతం ఇచ్చేలా నిర్ణయం జరిగింది. దీనిప్రకారం రూ.270 కోట్లు పారితోషికంగా ఇవ్వాల్సి ఉంది. అయితే మైత్రీ మూవీస్ వారు బన్నీకి ఇవ్వాల్సిన పారితోషికంలో కోత పెట్టినట్లు తెలుస్తోంది. 27 శాతానికి బదులుగా 24 శాతమే ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే రూ.240 కోట్లు పారితోషికంగా బన్నీకి అందింది. దీంతో రూ.30 కోట్లకు కోత పడింది.
రూ.240 కోట్లు ఇచ్చారు
అనుకున్న ఒప్పందం ప్రకారం రూ.270 కోట్లు రావాలి. అయితే అందులో నుంచే మళ్లీ రూ.30 కోట్లు నిర్మాతలు తగ్గించారు. ఏం జరిగిందనే విషయం తెలియదుకానీ రూ.240 కోట్లు ఇచ్చారని తెలుగు ఫిలింనగర్ వర్గాల్లో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ లెక్కన తమిళ దళపతి విజయ్ నటించబోతున్న చివరి చిత్రానికి రూ.275 కోట్లు పారితోషికంగా ఇస్తున్నారు. రజనీకాంత్ జైలర్ సినిమాకు రూ.250 నుంచి రూ.270 కోట్లు పారితోషికంగా అందింది. ఇలాంటప్పుడు అల్లు అర్జున్ కు పారితోషికం వారిమీద తక్కువే వచ్చినట్లు అవుతుంది. ఇందులో వాస్తవమెంతో తెలియదుకానీ నిర్మాతలు ఎందుకు తగ్గించారు? అనేది వారికే తెలియాలి. ఐదోతేదీన ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో విడుదల చేయబోతున్నారు.