Pushpa keshava:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప` సినిమా ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో బన్నీకి అసిస్టెంట్‌గా కేశవ పాత్రలో జగదీష్ అనే నటుడు కనిపించిన విషయం తెలిసిందే. కథలో హీరో పాత్రని, అతని ప్రయాణాన్ని తన పరిచయ వ్యాఖ్యాలతో పరిచయం చేసి కేశవగా అందరి దృష్టిని ఆకర్షించాడు.
ప్రస్తుతం `పుష్ప 2`లోనూ నటిస్తున్న జగదీష్ ఇటీవల ఓ యువతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ కావడం టాలీవుడ్‌లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసులో కేశవ కారణంగానే ఓ యువతి ఆత్మహత్యకు పూనుకుందని నిర్ధారణకు రావడంతో అతన్ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారించిన పోలీసులకు జగదీష్ ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. గతంలో తనతో సన్నిహితంగా ఉన్న యువతి మరొకరికి దగ్గర కావడంతో అది భరించలేక తనని మళ్లీ దారిలోకి తెచ్చుకునేందుకు ఆమె ఫొటోలు తీసి భయపెట్టానని సినీ నటుడు బండారు ప్రతాప్ అలియాస్ జగదీష్ పోలీసు విచారణలో వెల్లడించినట్టు సమాచారం.
యువతి ఆత్మహత్యకు కారణమైన జగదీష్‌ను ఇటీవల పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు రెండు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. సినిమా అవకాశాల కోసం నగరానికి చేరుకున్న జగదీష్‌కు ఐదేళ్ల క్రితం ఓ యువతితో పరిచయం అయింది. కొంత కాలానికి అది ప్రేమగా మారింది. శారీరకంగానూ దగ్గరయ్యారు. ఈ క్రమంలో `పుష్ప` సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు రావడంతో సినిమా అవకాశాలు పెరిగి అతని ప్రవర్తనలో మార్పులు మొదలయ్యాయి. ఇది నచ్చని ఆ యువతి మరొకరికి దగ్గరైంది.
ఈ విషయం తెలుసుకున్న జగదీష్ ఆమెను మళ్లీ ఏదోవిధంగా దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. గత నెల 27న పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిథిలో నివాసం ఉంటున్న యువతి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో సదరు యువకుడితో సన్నిహితంగా ఉండటం చూసి సెల్ ఫోన్‌తో ఫొటోలు తీశాడు. వాటిని ఆమెకు పంపి తన మాట వినకుంటే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. దీన్ని అవమానంగా భావించిన యువతి గత నెల 29న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. జగదీష్ బెదిరింపుల వల్లే తన కూతురు ఆత్మహత్యకు పూనుకుందని తెలుసుకున్న ఆమె తండ్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 6న జగదీష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం కస్టడీలోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం.