JAISW News Telugu

Purandeswari : విజయవాడ ఎంపీ స్థానం నుంచి పురంధేశ్వరి.. !

Purandeswari

Purandeswari

Purandeswari : పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జాతీయ పార్టీలు కసరత్తు చేపట్టాయి. మొన్న భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయగా.. కాంగ్రెస్ కూడా అదే బాట పట్టింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక్క సీటును కూడా బీజేపీ ప్రకటించలేదు. దీనికి కారణం పొత్తు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ+జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఇదే పొత్తులోకి బీజేపీ కూడా చేరుతుందన్న ఊహాగానాలకు ఫస్ట్ లిస్ట్ ప్రాణం పోసినట్లు తెలుస్తోంది.

అయితే బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొనసాగుతుంది. ఆమె ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటుంది. ఇందులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా దగ్గుపాటి పురందేశ్వరి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల (మార్చి) 9న ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్ర నేతలతో చర్చలు జరుపుతారని వార్తలు వినిపిస్తున్నాయి.

అదే రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని, మూడు పార్టీల నేతలు ఉమ్మడి ప్రకటన కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పొత్తులో భాగంగా విశాఖ, అరకు, తిరుపతి, విజయవాడ, శ్రీకాకుళం స్థానాలు ఉన్నాయి. విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పురందేశ్వరి పోటీ చేస్తే మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే పొత్తుపై ప్రకటనతో పాటు క్లారిటీ వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పురంధేశ్వరి అధ్యక్షురాలు కాబట్టి పక్కాగా గెలిచే స్థానం నుంచి పోటీ చేస్తుందని కూడా విశ్లేషిస్తున్నారు.

Exit mobile version