Election Commission : దేశ వ్యాప్తంగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్న అధికారులు వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో ఎన్నికల వేళ భారీగా నగదు, డ్రగ్స్, మద్యాన్ని అధికారులు సీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 4,658 కోట్ల విలువైన సొత్తు పట్టుబడింది.
లోక్ సభ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధికమని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా నగదు, మద్యం తరలింపు మాత్రం ఆగడం లేదు. పట్టుబడిన వాటిలో రూ.2,068 కోట్ల డ్రగ్స్, రూ.489 కోట్ల మద్యం, రూ.562 కోట్ల బంగారం, వెండి, రూ.1,142 కోట్ల బహుతులు ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. మార్చి 1 నుంచి రోజూ సగటున రూ.100 కోట్ల అక్రమ నగదు దొరుకుతున్నట్లు ఈసీ వెల్లడించింది.
ఎన్నికలు సజావుగా జరగటానికి ఎక్కడ కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం ఇతరత్రా తరలించే వారిపై అధికారులు నిఘా పెంచారు. దీనికోసం అన్ని జిల్లాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అయినప్పటికీ డబ్బు, మద్యం పట్టుబడుతూనే ఉంది.