Priyanka Gandhi : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ గతంలో కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ సమయంలో ప్రియాంకాగాంధీ తన సోదరుడిని ఉద్దేశించి ఒక ఎమోషనల్ పోస్టు పెట్టారు. వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న కాంగ్రెస్ ను మరింత ముంచుతున్నారంటూ రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ విమర్శలనన్నింటిని తట్టుకొని చేసిన పోరాటానికి తగ్గట్టుగా సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ క్రమంలో రాహుల్ ను కొనియాడుతూ ప్రియాంక ఒక పోస్టు పెట్టింది
‘‘వారు నిన్ను అడ్డుకునేందుకు ఏమీ చేసినా, ఏ మాటలే అన్నా నువ్వు దృఢంగా నిల్చొని ఉన్నావు. అవరోధాలు ఎదురైనప్పుడు వెనక్కి తగ్గలేదు, నీ సిద్ధాంతాన్ని ఎంతగా అవమానించినా నమ్మకం కోల్పోలేదు. వారు ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా, సత్యం కోసం నీ పోరాటాన్ని ఆపలేదు. ప్రతిరోజు వారు నీకు ద్వేషం, కోపాన్ని పంచినా దానిని నీ దరి చేరనివ్వలేదు. ప్రేమ, సత్యం, దయాగుణంతోనే ముందుకువెళ్లావు. ఇంతకాలం నిన్ను చూడలేనివారు, ఇప్పుడు చూస్తారు. కానీ నీవు మాలో అందరికంటే ధైర్యవంతుడివని మాకు తెలుసు’’ అని ఉద్వేగపూరితంగా పోస్టు పెట్టారు.
ఈ లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు పరాజయాలు ఎదురవడంతో ఈసారి కూడా ఫలితం అలానే ఉంటుందని అనుకున్నారు. రాహుల్, ప్రియాంతో పార్టీని కాపాడటం కష్టమనే భావన వ్యక్తమైంది. వారిద్దరూ ఐరన్ లెగ్లంటూ బీజేపీ అపహాస్యం చేసింది. అయితే, మంగళవారం ఉదయం ఫలితాల సరళి మొదలైన దగ్గరి నుంచి ఆ పార్టీకి ప్రాణం లేచి వచ్చింది. అధికారంలోకి రాకపోయినా, తిరిగి పుంజుకుంటామనే ధైర్యం వచ్చింది. అందుకు ఈ తోబుట్టువుల ప్రచారంతో పాటు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యూహాలు తోడయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.