Union Minister Kishan Reddy : ‘విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పెండింగ్ లో ఉంది. ఆ ఫైల్ లో ఏమీ కదలిక లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదు కాబట్టి కార్మికులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కేంద్రంలో ఉన్న ఎన్డీయే సర్కార్ కూడా అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ డాక్యుమెంట్లు ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్నాయని, దీనిపై ప్రస్తుతం ఎలాంటి కదలిక లేదని ఆయన వెల్లడించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ఆలోచన చేస్తున్నా దాన్ని కొనే స్థాయిలో సంస్థలు లేవని కిషన్ రెడ్డి వెల్లడించారు. దీంతో విశాఖ ఉక్కు కర్మాగారం యథావిధిగా నిర్వహణకు కేంద్రం సాయం చేయబోతోందని కూడా ఆయన తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు మైన్స్ కేటాయింపు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని, ఉక్కు శాఖతో మాట్లాడి త్వరలో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డి వెల్లడించారు. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా వేలంలో పాల్గొని గనులు దక్కించుకోవచ్చని సలహా ఇచ్చారు.