Ex CM Jagan : మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద భారీగా మోహరించిన ప్రైవేట్ సెక్యూరిటీ

Private Security at Ex CM Jagan Residence
Ex CM Jagan : గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద భారీగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసు సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 30మందితో కొత్తగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం ముందు నుంచి సామాన్య ప్రజలు వెళ్లకుండా పోలీసులు నిబంధనలు విధించారు. అంతటితో ఆగకుండా ఎక్కువగా మాట్లాడిన వారిపై కేసులు కూడా నమోదు చేశారు. మొత్తంగా ఆ ప్రాంతంలో ఆంక్షలు పెట్టారు. దీంతో స్థానిక ప్రజలు ఐదేళ్ల పాటు నానా ఇబ్బందులు పడ్డారు. దాదాపు 1.5 కిలో మీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వచ్చేది. స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ఇంటి ముందున్న రోడ్డుపై ఆంక్షలను తొలగించింది. దీంతో ఆ రోడ్డు ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లేందుకు అందుబాటులోకి వచ్చింది.
స్థానికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జగన్ నివాసం వద్ద మార్గాల్లో ఉంచిన బారికేడ్లు తొలగించింది. రోడ్డుకు రెండు వైపులా పోలీసు చెక్ పోస్టులు ఉంచింది. దీంతో ఆ ప్రాంతాల గుండా ప్రజల రాకపోకలు మొదలయ్యాయి. జగన్ నివాసం వద్ద పోలీస్ సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించడంతో జగన్ మోహన్ రెడ్డి ప్రైవేట్ సెక్కూరిటీతో భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 30మంది కొత్త వారితో ఆయన నివాసం వద్ద సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు.