JAISW News Telugu

UP Kaushambi Jail : ఖైదీ బిడ్డకు జైల్లో ట్వంటీ ఫస్ట్ డే – యుపి కౌశాంబి జైలులో ఘనంగా నిర్వహించిన సిబ్బంది

UP Kaushambi Jail

UP Kaushambi Jail

UP Kaushambi Jail : ఓ ఖైదీ బిడ్డకు జెలులో ట్వంటీ ఫస్ట్ డే ఘనంగా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబి జిల్లా జైలు క్యాంపస్ మంగళవారం ఈ ఫంక్షన్ కు వేదికైంది. జైలు అధికారులు మాయ అనే మహిళా ఖైదీ బిడ్డకు ట్వంటీ ఫస్ట్ డే (నామకరణం) వేడుకను ఘనంగా నిర్వహించారు. సెల్ ను బెలూన్లతో అలంకరించి, ఖైదీలందరికీ స్వీట్లు, స్నాక్స్ పంచిపెట్టారు. తల్లీబిడ్డలకు కొత్త బట్టలు తీసుకువచ్చి, చంటిబిడ్డను ఉయ్యాలలో ఉంచి తల్లి ఇష్ట ప్రకారం ఆ పసిబిడ్డకు మాన్వి అని పేరు పెట్టారు. ఈ సందర్బంగా 53 మంది మహిళా ఖైదీలతో కలిసి సిబ్బంది పాటలు పాడుతూ, మ్యూజిక్ ప్లే చేసి సంబురంగా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విందు భోజనం ఏర్పాటు చేశారు.

ఈ వేడుకకు ఖర్చంతా సిబ్బందే భరించినట్లు జైలు సూపరింటెండెంట్ మిశ్రా మీడియాకు తెలిపారు. మాయ చీటింగ్ కేసులో శిక్షపడి జైలుకు వచ్చేనాటికి 7 నెలల గర్భవతి కావడంతో ఆమెకు జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని చెప్పారు. మంచి ఆహారాన్ని అందిస్తూ అవసరమైన ఆరోగ్య పరీక్షలు చేయించామన్నారు. 20 రోజుల క్రితం ఆమెకు పండంటి బిడ్డ పుట్టగా మంగళవారం ఆస్పత్రి నుంచి సెల్ కు తీసుకువచ్చి వేడుక నిర్వహించామన్నారు. కాగా, ఓ ఖైదీ బిడ్డకు నామకరణ వేడుకను జైల్లో నిర్వహించడం ఇదే తొలిసారి.

Exit mobile version