Telugu Desam : తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు.. చంద్రబాబు మనసులో ఎవరున్నారంటే?
Telugu Desam : పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో టీడీపీని మరో సారి గ్రౌండ్ లెవల్ నుంచి పునరుజ్జీవం తీసుకురావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న టీడీపీకి ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఇప్పిటికీ టీడీపీకి హార్డ్ కోర్ ఫ్యాన్ ఉన్నారంటే సందేహం లేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ దూరంగా ఉండడంతో కేడర్ విచ్చినమైంది. ఈ నేపథ్యంలో పార్టీని దృఢంగా మార్చేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే పార్టీ పనుల్లో నిమగ్నమయ్యారు. ఏపీ ఎన్నికల్లో ఎక్కడెక్కడ తమ కూటమి అభ్యర్థులు గెలుస్తారు.. ఎక్కడెక్కడ ఓడిపోతారు.. దానికి గల కారణం తదితరాలపై నాయకులతో విశ్లేషిస్తున్నారు. దీని తర్వాత పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ టీడీపీని క్షేత్ర స్థాయి నుంచి పునరుజ్జీవం చేసేందుకు తీసుకునే చర్యలపై ఆయన ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు కాసేపటి క్రితం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయడం లేదనే నిర్ణయంతో తెలంగాణ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత కొత్త టీటీడీపీ చీఫ్ ను చంద్రబాబు నియమించలేదు. ఇప్పుడు ఆ పదవి ఖాళీగా ఉండడంతో ఈ పదవిలో నియమించేందుకు చంద్రబాబు ఎవరిని దృష్టిలో పెట్టుకున్నారనే చర్చ సాగుతోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టీడీపీ ధీమాగా ఉన్న నేపథ్యంలో టీటీడీపీ అధ్యక్ష పదవికి భారీ డిమాండ్ ఉంటుంది. ఈ విషయం చంద్రబాబుకు తెలుసు. అయితే అక్కడ కూడా పార్టీని ముందుకు నడిపే భారీ జనాధరణ ఉన్న నాయకుడిని తీసుకోవాలని బాబు అనుకుంటున్నారు. ఈ పదవిలో నియమించే నాయకుడి గురించి చంద్రబాబు వేగంగా పావులు కదుపుతున్నారు.