Prashant Kishore : అంచనాలు తప్పుతున్న ప్రశాంత్ కిషోర్ జోస్యాలు!
Prashant Kishore : ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి రావడం కష్టమేనని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడి మాదిరి ప్రవర్తించకుండా ఓ నియంతలా మారిపోయారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తాను అనుకున్నదే చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో జగన్ పాలనకు విసిగిపోయారు. ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్నారు.
ప్రజా సమస్యలను పట్టించుకోవాల్సిన జగన్ నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ప్రజల ఆకాంక్షలను పక్కన పెట్టేశారు. రోడ్ల గురించి ఒక్క పైసా విడుదల చేయలేదు. రాజధాని నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, నిరుద్యోగ నిర్మూలన వంటి అంశాలపై ఫోకస్ పెట్టలేదు. అప్పులు ఎడాపెడా చేస్తూ నెలనెల ప్రజల ఖాతాలలో డబ్బులు వేస్తున్నా అప్పుల భారం మాత్రం కొండెక్కుతోంది.
ఈనేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ అధికారంలోకి రావడం కష్టమే అంటున్నారు. దీంతో రాబోయే ఎన్నికలు ఆయన భవిష్యత్ ను మార్చనున్నాయి. వ్యతిరేక ఫలితాలు రానున్నాయని చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ అంచనాలు, వ్యూహాలు నిజం కావడం లేదు. దీంతో ఇప్పుడు జగన్ గురించి పీకే చెబుతున్నవి నిజమవుతాయా? తేలిపోతాయా చూడాలి.
గతంలో హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో పీకే బీజేపీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పినా అది నెరవేరలేదు. అక్కడ కాంగ్రెస్ విక్టరీ సాధించింది. గత ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కూడా అక్కడ బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పినా కాంగ్రెస్ గెలిచింది. ఇలా పీకే మాటలు నీటిమూటలే అవుతున్నాయి. దీంతో పీకే జోస్యంపై ఎవరికీ నమ్మకం కుదరడం లేదు.
తెలంగాణలో కూడా డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని చెప్పినా కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఇలా పీకే చెప్పిన మాటలు కార్యరూపం దాల్చడం లేదు. దీంతో పీకే జోస్యానికి విలువ లేకుండా పోతోంది. ఇప్పుడు ఏపీలో జగన్ పాలన అంతమవుతుందని చెబుతుండడంతో ఆయన మాటల్లో వాస్తవమెంతో వేచి చూడాల్సిందే మరి.