Salaar:పృథ్వీరాజ్ సుకుమారన్ లేకపోతే `సలార్` లేదు:ప్రశాంత్ నీల్
Salaar:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `సలార్:పార్ట్ 1 సీజ్ఫైర్`. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా పేరే వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారి ట్రెండ్ అవుతున్న `సలార్` గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ తాజాగా ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
“సలార్`లో పృథ్వీరాజ్ సుకుమారన్‌ని సెకండ్ హీరోగా ఒప్పించడం కష్టమవుతుందేమో అనుకున్నా. కానీ ఆయనకు స్క్రిప్ట్ నచ్చింది. వెంటనే అంగీకరించారు. వరదరాజ మన్నార్ పాత్రలో ఒదిగిపోయే నటుడి కోసం చాలా కసరత్తు చేశాం. బాలీవుడ్ నటులను తీసుకోవాలని కొందరు సలహాలిచ్చారు. నేను మాత్రం పృథ్వీరాజ్ సుకుమారన్నే తీసుకోవాలని నిర్ణయించుకున్నా. ప్రేమ, ద్వేషం రెండూ చూపించగల నటుడు ఆయన మాత్రమే.
పృథ్వీ ఒక సన్నివేశాన్ని నటుడి కోణంలోనే కాకుండా దర్శకుడిలా కూడా ఆలోచిస్తారు. ఆయనకు ఉత్తమ అసిస్టెంట్ డైరెక్టర్ అని బిరుదు ఇవ్వొచ్చు. `సలార్` కోసం ఆయన ఎన్నో ఆలోచనలు పంచుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన లేకపోతే `సలార్` లేదు` అన్నారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారే పవర్ ఫుల్ స్టోరీతో ఈ సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలి భాగం డిసెంబర్ 22న రిలీజ్‌కాబోతోంది. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలోని కీలక పాత్రల్లో జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రేయారెడ్డి, బాబి సింహా,, రామచంద్రరాజు, మధుస్వామి తదితరులు నటించారు.