Prasanna Vadanam Review : ‘ప్రసన్న వదనం’ మూవీ రివ్యూ.. సుహాస్ కు మరో హిట్ పడినట్టేనా?

Prasanna Vadanam Review

Prasanna Vadanam Review

Prasanna Vadanam Review : చిన్న సినిమాలతో పెద్ద హిట్లు కొడుతున్న సుహాస్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇండస్ర్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు  తెచ్చకుంటున్నాడు. చిన్న సినిమాలకు పెద్ద హీరోగా అవతరించాడు. ఇక తాజాగా ప్రసన్న వదనం సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకులను పలకరించాడు.

ఇదీ కథ..

ఆర్జేగా  పనిచేసే సూర్య(సుహాస్) తల్లిదండ్రులు యాక్సిడెంట్‌లో  చనిపోతారు.  ఈ యాక్సిడెంట్ తో  సూర్య   ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే వ్యాధి కి గురవుతాడు.  ఎవరి మొహాలను గుర్తుపట్టలేకపోవడం ఈ వ్యాధి లక్షణం.   తన సమస్య ఎవరూ గుర్తించకుండా తంటాలు పడుతుంటాడు. తన మిత్రుడు  విఘ్నేశ్  (వైవా హర్ష)కు మాత్రమే ఈ వ్యాధి  గురించి  తెలుసు. ఈ క్రమంలో సూర్యకు ఆద్య(పాయల్) పరిచయం అవుతుంది. ఏదో ఒకరకంగా ఆమె రోజూ కలుస్తున్నా గుర్తుపట్టలేకపోతుంటాడు.  కొన్ని సంఘటనల అనంతరం వారు ప్రేమలో పడతారు.  
ఓ రోజు తెల్లవారుజామున ఓ అబ్బాయి ఓ అమ్మాయి(సాయి శ్వేత)ని లారీ కిందకి నెట్టేసి చంపడానికి స్వయంగా చూస్తాడు సూర్య.  కానీ అది ఎవరు చేశారో తనకున్న వ్యాధి వల్ల  తెలుసుకోలేడు.  

ఎలాగైనా ఈ విషయాన్ని బయట పెట్టాలనుకొని పోలీసులకు కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేస్తాడు.  అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని చెప్తాడు. అనంతరం సూర్యపై దాడి జరుగుతుతంది. దీంతో సూర్య పోలీస్ స్టేషన్ కి వెళ్లి  ఏసీపీ వైదేహి(రాశీసింగ్)ని కలిసి అతని సమస్యను  చెప్తాడు. కానీ అనుకోకుండా సూర్య అదే మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అసలు హత్యకు గురైన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని  ఎవరు, ఎందుకు హత్య చేశారు ? పోలీసులు ఏం చేశఆరు? ఈ హత్యోందంతంతో సుహాస్ కి ఎదురైనా ఇబ్బందులు ఏంటి? సుహాస్ ని ఈ హత్య కేసులో ఇరికించారు? సుహాస్ కి తనకున్న ఫేస్ బ్లైండ్ నెస్  వల్ల వచ్చిన చిక్కులేంటి? తన లవ్ స్టోరీ ఏమైంది? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :  మొదటి సగ భాగం  సీన్లన్నీ  అతికించినట్టుగా కనిపించింది. స్నేహితుల మధ్య సన్నివేశాలు, హీరో పరిస్థితి చెప్పడానికి కొన్ని సీన్లు, హీరోయిన్ తో కొన్ని సన్నివేశాలు వస్తుంటాయి. సూర్య హత్య ఘటన చూసిన తరువాత నుంచి కథ  ఆసక్తిగా ముందుకు సాగుతుంది. ఇంటర్వెల్ కి ఆ మర్డర్ ఎవరు చేశారో ప్రేక్షకులకు చెప్పేయడంతో ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. కానీ సూర్య పాయింట్ అఫ్ వ్యూలో ఎవరు చంపారో తెలీదు కాబట్టి రెండో భాగం అంతా అతని కోణంలోనే కథ సాగుతుంది.  ఇక ఇక్కడి నుంచి తరువాత ఏం జరుగుతుందో అనే ఆసక్తిగా ప్రేక్షకుడిలో కలుగుతుంది. ద్వితీయార్థంలో వచ్చే ట్విస్ట్ లు కూడా బాగుంటాయి.  క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ నూ ఎవరూ ఊహించలేరు.  క్లైమాక్స్ అయ్యాక ఎండింగ్ ఉంటే బాగుండని ప్రేక్షకులకు అనిపిస్తుంది. ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్, హీరో పాత్ర మొహాలు గుర్తు పట్టలేడు అనే విషయాలను చక్కగా చూపించగలిగారు.

పర్ఫార్మెన్స్..

సుహాస్ మరోసారి తన నటనతో మెప్పించాడు. తన సమస్యతో ఇతరులను గుర్తుపట్టలేక  బాధపడే సన్నివేశాల్లో జీవించేశాడు. పాయల్ రాధాకృష్ణ తన వరకు పర్వాలేదనిపించింది.  ఇక రాశీసింగ్ నటనకు ఫిదా అవ్వాల్సిందే .కొన్ని సన్నివేశాలు వావ్ అనిపిస్తాయి. లేడీ పోలీసాఫీసర్ గా బాగా సెట్ అయింది. నితిన్ ప్రసన్న కూడా మెప్పిస్తాడు. వైవా హర్ష, నందు కూడా ఓకే అనిపించారు.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్..

విజువల్స్ చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కేక.  ద్వితీయార్థానికి బిజీఎం ప్రాణం పోసింది. బేబీ లాంటి లవ్ స్టోరీకి మ్యూజిక్ ఇచ్చింది  విజయేనా అని ఆశ్చర్యపోక తప్పదు. అయితే పాటలు మాత్రం యావరేజ్. అలాగే హీరో  క్యారెక్టర్ కు సెట్ అయ్యేలా ఫైట్స్ కంపోజ్ చేశారు. స్టోరీ పరంగా చూస్తే ఇది మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ఈ పాయింట్ తో చాలా సినిమాలు వచ్చినా హీరోకు ఉండే వ్యాధి లక్షణంతో  మర్డర్ మిస్టరీ ఎలా పరిష్కరించాడు అనే కోణంలో దర్శకుడు సన్నివేశాలు తీర్చిదిద్దుకున్నాడు. దర్శకుడిగా పూర్తి మార్కులు వేయించుకున్నాడు.

TAGS