Prakash Raj:ప్రకాష్ రాజ్‌కు వంద కోట్ల కేసులో ఈడీ క్లీన్ చిట్
Prakash Raj:అక్రమ నగదు బదిలీ కేసులో చిక్కుకున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఊరట లభించింది. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన జువెల్లరీ గ్రూప్ పై రూ.100 కోట్ల పోంజీ, మోసం కేసులో నటుడు ప్రకాష్ రాజ్ పేరు వినిపించింది. దీనికి సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ `(ఈడీ) సమన్లు జారీ చేసి ఆయనను విచారించింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆయనకు క్లీన్ చిట్ లభించింది. నివేదికల ప్రకారం మనీలాండరింగ్ కేసులో ప్రకాష్ రాజ్ ప్రమేయం లేదని తేలింది.
ఆయన కేవలం ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే నని తెలిపింది. దీని గురించి తాజాగా ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. `తమిళం అర్థం కాని వారి కోసం. తమిళనాడులోని ప్రణవ్ జువెల్లర్స్ మోసంతో ప్రకాష్ రాజ్‌కు ఎలాంటి సంబంధం లేదని అధికారిక ప్రకటన వెలువడింది. నా వెంట నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నన్ను నమ్మి ఎందరో ఆదరించారు. సత్యమేవ జయతే“ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
తిరుచ్చిరాపల్లికి చెందిన భాగస్వామ్య సంస్థ ప్రణవ్ జువెల్లర్స్‌పై ఈడీ దర్యాప్తు చేస్తోంది. నవంబర్ 20న ఈడీ అధికారులు దాడులు నిర్వహించి రూ. 23.70 లక్షల నగదు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంస్థకు జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయనని ప్రశ్నించాలని ఈడీ సమన్లు జారీ చేసి ప్రశ్నించింది. కొన్ని ఉద్దేశపూర్వక చెల్లింపులు ఆయన నుంచి జరిగాయని భావించిన ఈడీ ఆయనకు సమన్లు చేసింది.
దీంతో ప్రకాష్ రాజ్ ఈ వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడుకు చెందిన ప్రణవ్ జువెల్లర్స్ గోల్డ్ ఇన్‌వెస్ట్‌మెంట్ స్కీమ్ పేరుతో ప్రజలను మోసం చేసి వారి నుంచి రూ.100 కోట్లు వసూలు చేయడంతో తమిళనాడు ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడంతో రంగంలోకి దిగిన ఈడీ దర్యాప్తు చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే నటుడు ప్రకాష్‌రాజ్‌కు సమన్లు జారీ చేయడం ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే.