Prajapalana : మాది ప్రజాపాలనే.. అన్ని డిసిషెన్లు అసెంబ్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి
Prajapalana : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో కీలక మార్పులు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలను ఇక నుంచి అసెంబ్లీలోనే తీసుకోవాలని అనుకుంటున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కారు ఏక పక్ష నిర్ణయాలు తీసుకుని ప్రజా వ్యతిరేకత మూట గట్టుకుంది. ఇలా కాకుండా అందరి అభిప్రాయాలు తీసుకుని ఏవైనా కార్యక్రమాలు చేయాలని చూసుకుంటున్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన నిర్వహించనున్నారు. దీని కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమరవీరులను స్మరించుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర గేయం, చిహ్నం, రాష్ట్ర గీతం మార్పులను చేసింది. ఫైనల్ గా ఈ మార్పులపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ప్రచారం చేయడం మొదలెట్టింది.
రాష్ట్ర చిహ్నాం లో చార్మినార్, కాకతీయ కళాతోరణం ఉండేది. వాటిని తొలగించి అందులో అమరవీరుల స్తూపం, ధాన్యం గింజలు ఉండేలా చిహ్నం రూపొందించారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. రేవంత్ కూడా ఒంటెత్తు పోకడలకు పోతున్నారని అంటున్నారు. దీంతో ఈ నిర్ణయాన్ని ఆపి ఉంచారు. కేవలం రాష్ట్ర గేయంలో మార్పులను మాత్రం చట్టబద్ధం చేశారు. ఇలాంటి నిర్ణయాలను కచ్చితంగా అసెంబ్లీలోనే తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదంతోనే రైతు భరోసా, ధరణి, జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు.
కాంగ్రెస్ నాయకులు మాత్రం గత పాలనకు మా పాలనకు ఎంతో తేడా ఉందని చెబుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రతి సారి ఏక పక్ష నిర్ణయాలే తీసుకునే వారని, ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. మేధావులు, విద్యావంతులు, రాజకీయ ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకుని ప్రజా పాలన సాగిస్తుందని చెబుతున్నారు. జూన్ 2 రోజున మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. రేవంత్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లో ఎలాంటి ప్రకటన చేస్తారోనని అందరూ ఎదురు చూస్తున్నారు.