Prajapalana : ‘ప్రజాపాలన’ సూపర్ హిట్టు.. అమ్మో అన్ని దరఖాస్తులా?
Prajapalana : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దూకుడుగా తన మ్యానిఫెస్టోను అమలు చేసే ప్రయత్నం చేస్తోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే రేవంత్ రెడ్డి రెండు గ్యారెంటీలను అమల్లోకి తీసుకొచ్చారు. ఇక మిగతా గ్యారెంటీలు, ఇతర పథకాల కోసం ‘ప్రజాపాలన’ పేరిట దరఖాస్తులు స్వీకరించారు. డిసెంబర్ 28నుంచి నిన్నటివరకు(జనవరి 6) దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 1.25లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను ఈనెల 17వరకు డేటా ఎంట్రీ చేయనున్నారు. అనంతరం ఆయ పథకాలకు అర్హుల ఎంపిక మొదలుపెట్టనున్నారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారెంటీల్లోని మహాలక్ష్మీ, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు గ్రామ, వార్డు, డివిజన్ సభల్లో దరఖాస్తుల స్వీకరించారు. అఖరి రోజూ జనాలు పోటెత్తారు. ప్రజా పాలన దరఖాస్తుల్లో మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇళ్లపై దరఖాస్తుల్లో ఎక్కువ మంది ఆసక్తి చూపినట్టు అధికారులు చెపుతున్నారు. అలాగే రేషన్ కార్డుల కోసం, వాటిలో మార్పులు, చేర్పులు కోసం కూడా భారీగానే దరఖాస్తులు వచ్చాయి. వీటిని తెల్ల కాగితంపై రాసి దరఖాస్తు చేసుకున్నారు.
ప్రజాపాలన కార్యక్రమం ముగిసినా.. ఈ కార్యక్రమాన్ని ప్రతీ నాలుగు నెలలకోసారి నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. మొదటి దశ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేని వారు మరో విడతలో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంలో తమ ఆకాంక్షలు నెరవేరకపోవడంతోనే ప్రజాపాలనకు జనాలు పోటెత్తినట్టు తెలుస్తోంది. డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం పేరిట ఊరికి పది మందికి కూడా ఇండ్లు అందలేదు. కానీ ఇండ్లు లేనివారు వందల్లో ఉన్నారు. ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉన్నా ప్రభుత్వ సహకారం లేకపోవడంతో జనాలు నిరాశ పడ్డారు. అందుకే ఎక్కువగా జనాలు ఆ పథకానికి మొగ్గు చూపారు. అలాగే బీఆర్ఎస్ రేషన్ కార్డులు గత కొన్నేండ్లుగా జారీ చేయకపోవడం, మార్పులు, చేర్పులకు అవకాశం ఇవ్వకపోవడంతో.. ప్రజాపాలనలో భారీగా వాటి కోసం దరఖాస్తు చేసుకున్నారు.
పింఛన్లు, రైతు భరోసాకు దాదాపు బీఆర్ఎస్ బాగానే అమలు చేసింది. అయినా కొందరు కొత్త వాళ్లు ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నారు. ఇక మహాలక్ష్మీ పథకం పూర్తిగా కొత్తది, మహిళ రూ.2500సాయం కాబట్టి దాదాపు అందరూ మహిళలు మొగ్గుచూపారు. కాకపోతే వీటిలో ఎవరికీ అవకాశాలు ఇస్తారు..ఇంటిలో అందరికీ ఇస్తారా..అనే సందేహాలు వస్తున్నాయి. వీటన్నంటికీ త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి.