Praja Bhavan:అదిగో పులి అంటే ఇదిగో తోక అనే చర్చ చాలా కాలంగానే జరుగుతూనే ఉంది. అయితే సోషల్‌మీడియా ప్రభావం పెరిగిన దగ్గరి నుంచి ప్రతి చిన్న విషయంపై కూడా నెట్టింట చర్చ జరుగుతూ వైరల్‌గా మారుతోంది. ఏ విషయం నచ్చకపోయినా వెంటనే దానిపై సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటి చర్చే ఒకటి నెట్టింట జోరుగా జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ దంగల్‌లో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలని దక్కించుకోవడం..అధికారాన్ని హస్తగతం చేసుకోవడం తెలిసిందే.
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దూకుడు చూపిస్తూ వరుసగా సంచలన నిర్ణయమాలు తీసుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలైన ఆరు గ్యారంటీల ఫైలుపై తొలి సంతకం చేసిన రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం ఇస్తూ మలి ఫైలుపై సంతకం చేశారు. అక్కడి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ హాట్ టాపిక్ అవుతున్నారు.
ఇక ప్రగతిభవన్‌ను జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌గా మార్చిన రేవంత్‌రెడ్డి అక్కడే ప్రజా దర్బార్‌ను నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అన్నట్టుగానే ప్రతి శుక్రవారం ప్రజాభవన్‌లో `ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే రెండు రోజులు తిరక్కుండానే ప్రజాభవన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించారు. దీంతో ఇది ప్రజాభవన్ కాదు భట్టి భవన్ అంటూ కామెంట్‌లు మొదలయ్యాయి.
ఈ భవన్‌ను ప్రజల కోసం వినియోగిస్తామని చెప్పి రెండు రోజులు తిరక్కుండానే భట్టి భవన్‌గా మార్చడం ఏంటి రేవంత్ సారూ అని కొంత మంది కామెంట్‌లు చేస్తున్నారు. ఈ వాదనలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. కారణం ఏంటంటే ప్రజాభవన్ గా మార్చిన భవనాల సముదాయంలో మరి కొన్ని భవనాలు ఉన్నాయి. ఇందులోనే భట్టి విక్రమార్కకు ఓ భవనాన్ని కేటాయించారే తప్ప ప్రజాభవన్‌ను కేటాయించలేదని, ఇది తెలుసుకుని కామెంట్‌లు చేస్తే మంచిదని కొంత మంది అంటున్నారు.
రేవంత్‌రెడ్డి నిర్ణయంపై కామెంట్‌లు చేస్తున్న వారు ఇక్కడో విషయం మర్చిపోతున్నారు. ప్రజాభవన్ సముదాయంలో మొత్తం ఐదు భవనాలున్నాయి. ఇందులో ఒకటి ప్రజాభవన్ గా ప్రజా దర్బార్ కోసంవినియోగిస్తున్నారు. ఇక రెండవ భవనాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కుకు అప్పగించారు. ఆయన అధికారిక నివాసం కోసం తాజాగా కేటాయించారు. మిగిలిన వాటిల్లో మరో భవనాన్ని మరో మంత్రికి కేటాయించనున్నారట. ఇలా ఒక్కో భవనాన్ని రేవంత్‌రెడ్డి ఒక్కో దాని కోసం కేటాయించడం మంచి నిర్ణయం. ఈ విషయం తెలియని వాళ్లే రేవంత్‌రెడ్డి నిర్ణయాన్ని తప్పుబడుతూ కామెంట్‌లు చేస్తున్నారు ఇదీ అసలు సంగతి.